Hyderabad: విద్యార్థుల కలలే వికసిత భారత్‌కు పునాదులు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
Hyderabad: హైదరాబాద్ నాచారం డీపీఎస్‌లో 'మేరే సప్నో కా భారత్' చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య బహుమతులు అందించారు.
Hyderabad: విద్యార్థుల కలలే వికసిత భారత్‌కు పునాదులు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
హైదరాబాద్: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా ‘మేరే సప్నో కా భారత్ – చిత్ర సేవ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ఉప పక్షనేత మల్క కొమురయ్య తెలిపారు. విద్యార్థులు నేడు కనే కలలే రేపటి వికసిత భారత్‌కు పునాదులవుతాయని పేర్కొన్నారు.
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను ఆయన పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ అంశాలపై చిత్రాలు గీస్తూ, ప్రసంగాల ద్వారా తమ ఆలోచనలను వ్యక్తపరిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మల్క కొమురయ్య బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు చక్కని వేదికగా నిలుస్తాయని అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువత, విద్యార్థుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, శాస్త్రసాంకేతిక అభివృద్ధి, పరిశుభ్రత, సమాన అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పోటీల్లో బహుమతులు సాధించడం కంటే కొత్త విషయాలను నేర్చుకోవడం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ముఖ్యమని చెప్పారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పోటీల నిర్వహణకు సహకరించిన పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూము వీరేందర్ గౌడ్, బీజేపీ టీచర్స్ సెల్ కో-కన్వీనర్ శివరామకృష్ణ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.




