LB Nagar: ఎల్‌బీనగర్ గురుకుల హాస్టల్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ!

LB Nagar: ఎల్‌బీనగర్ గురుకుల హాస్టల్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించి, తాగునీరు, మూత్రశాలలు సరిగా లేకపోవడాన్ని గుర్తించి అధికారులను మందలించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 10 Nov 2026 3:11 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్‌బీనగర్ గురుకుల హాస్టల్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ!

LB Nagar: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జెడ్‌సీ కార్యాలయం వెనుక ఉన్న గురుకుల హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి వచ్చాయి.

హాస్టల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పరిస్థితులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హాస్టల్‌లో తీవ్ర నీటి సమస్య ఉన్నట్లు గుర్తించారు. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉండే విద్యార్థులు సైతం తమ అవసరాలకు కావాల్సిన నీటిని వారే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు హాస్టల్‌లో ఉన్న 60 మూత్రశాలల్లో కేవలం 8 మాత్రమే వినియోగంలో ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనిచేయని మిగిలిన మూత్రశాలలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. హాస్టల్‌లో గుర్తించిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, రమేష్ ముదిరాజ్, బిచినేపల్లి వెంకటేశ్వరరావు, శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి, గండి సన్నియాదవ్, కొత్త రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR