LB Nagar: ప్రభాత్ నగర్ పార్కులో గేటు నిర్మాణానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే బ్రేక్!

LB Nagar: ప్రభాత్ నగర్ పార్కు స్థలాన్ని కాపాడాలని, హాస్పిటల్ గేటును ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జోనల్ కమిషనర్‌ను కోరారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 6 Nov 2026 2:09 PM IST
LB Nagar
X

LB Nagar: ప్రభాత్ నగర్ పార్కులో గేటు నిర్మాణానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే బ్రేక్!

LB Nagar: చైతన్యపురి డివిజన్ ప్రభాత్ నగర్ పార్కు స్థలాన్ని కాపాడాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధికారులను కోరారు. పార్కులోకి హాస్పిటల్ నుంచి గేటు ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే స్పందించారు. ఈ మేరకు కాలనీవాసులతో కలిసి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోను కలిసి వినతిపత్రం అందజేశారు.

గతంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా పార్కును సందర్శించిన ఎమ్మెల్యే.. కాలనీవాసుల అభ్యంతరాలను తెలుసుకున్నారు. లేఅవుట్‌లో భాగంగా పార్కు స్థలాన్ని ఓపెన్ స్పేస్‌గా కేటాయించారని, ఏళ్లుగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు వాకింగ్, యోగా కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. హాస్పిటల్ నుంచి పార్కులోకి గేటు ఏర్పాటు చేస్తే పార్కు వినియోగానికి, కాలనీవాసుల ప్రశాంతతకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు.

హాస్పిటల్‌కు గేటు అవసరమైతే పార్కు స్థలానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్కు స్థల స్వరూపాన్ని మార్చేలా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీమ్స్ హాస్పిటల్ 26 అంతస్తుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, పార్కు, రిజర్వాయర్, సబ్‌స్టేషన్, పోలీస్ స్టేషన్ వంటి మౌలిక సదుపాయాల కోసం అప్పట్లోనే జీవో తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 26 అంతస్తులకు బదులుగా 13 అంతస్తులకే నిర్మాణాలు చేపట్టిందని విమర్శించారు.

ప్రభాత్ నగర్ పార్కు కాలనీవాసుల హక్కు. దాని పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి పోరాడుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కు స్థలానికి నష్టం కలగనివ్వబోమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, త్రివేది, పవన్, జయశ్రీ, గట్టు శీను, రమణారెడ్డి, కాలనీ అధ్యక్షుడు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR