LB Nagar: ప్రభాత్ నగర్ పార్కును కాపాడుకుంటాం.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే!

LB Nagar: చైతన్యపురి ప్రభాత్ నగర్ పార్కు వద్ద గేటు ఏర్పాటు చేయవద్దని, వాకర్లకు ఇబ్బంది కలగకుండా పార్కును కాపాడుతామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 5 Nov 2026 1:20 PM IST
LB Nagar
X

LB Nagar: ప్రభాత్ నగర్ పార్కును కాపాడుకుంటాం.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే!

LB Nagar: ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్కుల పరిరక్షణకు కృషి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ పార్కును గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన సందర్శించారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా పార్కులో నడక సాగిస్తున్న స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పక్కనే నిర్మాణంలో ఉన్న టీమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పార్కు వద్ద గేటు ఏర్పాటు చేయనున్నట్లు తెలియడంతో వాకర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా వందలాది మంది స్థానికులు ఈ పార్కులో వాకింగ్ చేస్తున్నారని, గేటు ఏర్పాటు చేస్తే నడకకు సరిపడా స్థలం లేకుండా పోతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కును రెండు భాగాలుగా విభజించడం సరికాదని విన్నవించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. గతంలో టీమ్స్ ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆసుపత్రి పరిధిలో పోలీస్ స్టేషన్, చిన్నారుల పార్కు, వాటర్ ట్యాంకు, విద్యుత్తు సబ్‌స్టేషన్ తదితర అవసరాలకు స్థలం కేటాయించాలని కోరినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసిందని, ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోను పక్కన పెట్టారని పేర్కొన్నారు.

ఏది ఏమైనా ప్రభాత్ నగర్ పార్కు స్థలాన్ని వాకర్లకు అందుబాటులో ఉంచుతామని, పార్కు వద్ద గేటు ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్కును కాపాడుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హామీపై వాకర్లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, త్రివేది, పవన్, జయశ్రీ, గట్టు శీను, రమణారెడ్డి, కాలనీ అధ్యక్షుడు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR