Secunderabad: నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యం - ఎమ్మెల్యే బస్తీ పర్యటన!

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డు-4 పికెట్ బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. రూ. 338 కోట్ల నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి.

Srikanth, Secunderabad
Published on: 29 Sept 2026 1:30 PM IST
Secunderabad
X

Secunderabad: నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యం - ఎమ్మెల్యే బస్తీ పర్యటన!

Secunderabad: కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నవ కంటోన్మెంట్ నిర్మాణంలో భాగంగా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలోని వార్డు-4 పికెట్ లోని హరిజన బస్తీ, శ్రీరామ్ నగర్, సంతోషిమాత టెంపుల్ బస్తీలలో పర్యటన నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు లేవనెత్తిన సీవరేజ్, విద్యుత్, మంచినీటి సరఫరా మరియు రోడ్ల నిర్మాణ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన భూముల బదలాయింపు ప్రక్రియ ద్వారా వచ్చిన 338 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, వీటితో నియోజకవర్గంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు అధికారులతో నిధుల విషయంలో ఇప్పటికే మాట్లాడామని, అందరూ సానుకూలంగా ఉన్నారని, పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు త్వరగానే పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు పడక నీటి కొరత ఏర్పడిందని, కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ మంచినీటిని ఎంతో జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని కోరారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad