Thorrur: సంక్షేమ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఇందిరమ్మ బీమా: మల్‌రెడ్డి!
Thorrur: తొర్రూర్‌లోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్‌హాల్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు.
Thorrur: సంక్షేమ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఇందిరమ్మ బీమా: మల్‌రెడ్డి!
తొర్రూర్: దేశ సంక్షేమ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం సరికొత్త అధ్యాయంగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని శుక్రవారం తొర్రూర్‌లోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్‌హాల్‌లో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. లబ్ధిదారుల సమక్షంలో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను బటన్ నొక్కి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సుమారు లక్షా 20 వేల కుటుంబాలు ఉండగా, లక్షకు పైగా కుటుంబాలకు ఈ పథకం భరోసాగా నిలుస్తుందని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పథకం వర్తిస్తుందని, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్న ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా కృషి చేయాలని, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో ప్రజలకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




