Rangareddy: 4 మండలాల్లో వీధిదీపాలకు రూ.7.14 కోట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి
Rangareddy: ఆమనగల్లు, కడ్తాల్, మాడుగుల, తలకొండపల్లి మండలాల్లో వీధిదీపాలకు రూ.7.14 కోట్ల హెచ్ఎండీఏ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడి.
Rangareddy: 4 మండలాల్లో వీధిదీపాలకు రూ.7.14 కోట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, కడ్తాల్, మాడుగుల, తలకొండపల్లి మండలాల్లో హైమాస్ట్ లైట్లు, వీధిదీపాల ఏర్పాటుకు హెచ్ఎండీఏ నిధుల ద్వారా రూ.7.14 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కడ్తాల్ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, మంజూరు ఉత్తర్వుల ప్రతులను టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ఆయా మండలాల నాయకులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలుగు మండలాల్లో మొత్తం 291 పనులకు నిధులు కేటాయించినట్లు వివరించారు. ఆమనగల్లు మండలంలో 70 పనులకు రూ.1.74 కోట్లు, కడ్తాల్‌లో 65 పనులకు రూ.1.30 కోట్లు, మాడుగులలో 78 పనులకు రూ.2.54 కోట్లు, తలకొండపల్లిలో 78 పనులకు రూ.1.56 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని, రెండో విడతలో మరిన్ని గ్రామాలకు హెచ్ఎండీఏ నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే రూ.6 కోట్లతో హైమాస్ట్ లైట్లు, వీధిదీపాలు ఏర్పాటు చేశామని, అంతర్గత మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10.60 కోట్లు మంజూరు కాగా పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించి పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి, దారెడ్డి బాల్ రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శివలింగం, పోతుగంటి శంకర్, బట్టు కిషన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




