Hyderabad: తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం కలకలం!
Hyderabad: నాగోల్ తట్టి అన్నారం వద్ద ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మంగ మృతదేహం లభ్యం. ఇది హత్యేనని ఆమె కూతురు జ్యోతి అనుమానం వ్యక్తం చేశారు.
Hyderabad: తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం కలకలం!
Hyderabad: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న నాగోల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
మృతురాలు ఓయూ క్యాంపస్ సమీపంలోని మాణికేశ్వర్ నగర్‌కు చెందిన సుమారు 46 ఏళ్ల మంగగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 28న మంగ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
తాజాగా తట్టి అన్నారం సమీపంలో లభించిన మృతదేహం మంగదేనని పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే మహిళ ఎలా మృతి చెందిందనే విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు.
హత్య జరిగిందా? లేక మరేదైనా కారణమా?
ఈ అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహిళ హత్యకు గురైందని ఇప్పుడే నిర్ధారించలేమని ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణం స్పష్టమవుతుందని చెప్పారు.
కూతురు జ్యోతి అనుమానాలు
మంగ మృతిపై ఆమె కూతురు జ్యోతి అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నెల 28న ఉదయం 8:43 గంటలకు తన తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, ఆ తర్వాత తిరిగి రాలేదని తెలిపింది. మిస్సింగ్ ఫిర్యాదు చేసిన సమయంలోనే లక్ష్మమ్మ, సరిత అనే ఇద్దరిపై తమకు అనుమానం ఉందని పోలీసులకు చెప్పినట్లు జ్యోతి పేర్కొంది.
తాజాగా తన తల్లి వద్ద లక్ష్మమ్మ ఆధార్ కార్డు లభించిందని, అది అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై అనుమానం ఉందని జ్యోతి తెలిపింది. లక్ష్మమ్మ, సరితలను పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులను కోరింది.
మంగ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. మిస్సింగ్ కేసు, మృతదేహం లభించిన ఘటనకు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెలువడే ఆధారాల ఆధారంగా మంగ మృతికి అసలు కారణం తెలియనుంది.




