Hyderabad: ఉన్నత విద్యలో సరికొత్త మార్పు.. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పుస్తకావిష్కరణ

Hyderabad: ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి రచించిన “ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్” పుస్తకాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.

Arun Goud, Hyderabad
Published on: 2 Nov 2026 4:54 PM IST
Hyderabad
X

Hyderabad: ఉన్నత విద్యలో సరికొత్త మార్పు.. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పుస్తకావిష్కరణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ (డా.) వి. బాలకిష్టారెడ్డి రచించిన “Experiential Learning: A Game Changer in Higher Education” పుస్తకాన్ని TASK, AWS ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఉన్నత విద్య నాణ్యతను పెంపొందించడంతో పాటు, విద్యను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి రచించిన ఈ పుస్తకం ఎంతో విలువైనదని ప్రశంసించారు. అనుభవాధారిత అభ్యసనం ద్వారా విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని వాస్తవ జీవితంలో, ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ పుస్తకం విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ పుస్తకంపై అవగాహన కల్పించి, వారి అభ్యసన ప్రక్రియలో భాగంగా విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పుస్తకం యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరిస్తూ ప్రొఫెసర్ (డా.) వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, “Experiential Learning: A Game Changer in Higher Education” పుస్తకాన్ని విద్యార్థుల్లో ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు,

తరగతి గది అభ్యసనాన్ని వాస్తవ ప్రపంచ అనుభవాలకు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో రూపొందించినట్లు తెలిపారు. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, ప్రయోగాత్మక కార్యకలాపాలు, ప్రాజెక్టులు, సమస్యల పరిష్కారం, ఇంటర్న్‌షిప్‌లు మరియు పరిశ్రమలతో పరస్పర అనుసంధానం వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ఈ పుస్తకం ప్రత్యేక దృష్టి సారిస్తుందని వివరించారు.

ఈ పుస్తకం డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, తద్వారా వారిలో, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మరియు వృత్తిపరమైన సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత వేగంగా మారుతున్న ఉపాధి రంగంలో రాణించేందుకు ఈ నైపుణ్యాలు ఎంతో అవసరమని తెలిపారు.

ఉన్నత విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం, నైపుణ్యాధారిత విద్య మరియు అభ్యసన ఫలితాలపై ఆధారపడిన బోధనా విధానాలను అందించాల్సిన అవసరం ఉందని ఛైర్మన్ పేర్కొన్నారు.

విద్య, నైపుణ్యాలు, ఆచరణాత్మక అనుభవాలను సమన్వయం చేసే విధంగా విద్యా సంస్కరణలను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కట్టుబడి ఉందని తెలిపారు. తద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది, వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో TASK, AWS ప్రతినిధులు, ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad