Medipally: ధరణి కాలనీ సమస్యలపై డీసీ శైలజ క్షేత్రస్థాయి పరిశీలన

Medipally: మేడిపల్లి డివిజన్ ధరణి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కాంగ్రెస్ నాయకుడు తుంగతుర్తి రవితో కలిసి పరిశీలించి పరిష్కారానికి డీసీ శైలజ హామీ.

KARUNAKAR, UPPAL
Published on: 12 Nov 2026 10:11 PM IST
Medipally
X

Medipally: ధరణి కాలనీ సమస్యలపై డీసీ శైలజ క్షేత్రస్థాయి పరిశీలన

మేడిపల్లి: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ ధరణి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఇటీవల జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు.

డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రత్యేక చొరవతో అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో స్పందించిన అధికారులు గురువారం కాలనీలో పర్యటించారు. డిప్యూటీ కమిషనర్ శైలజ, తుంగతుర్తి రవితో కలిసి ధరణి కాలనీలో పర్యటించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు వివరించారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ సాయికిరణ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ లింగస్వామి, ధరణి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL