Medchal: జర్నలిస్టులకు ప్రత్యేక పింఛన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి

Medchal: జర్నలిస్టులకు శాశ్వత సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక పింఛన్, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరుతూ మేడ్చల్ కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు.

ASHOK, KAPRA
Published on: 16 Nov 2026 5:49 PM IST
Medchal
X

Medchal: జర్నలిస్టులకు ప్రత్యేక పింఛన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి

మేడ్చల్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు శాశ్వత సామాజిక భద్రత కల్పించడంతో పాటు, పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక జర్నలిస్టు పింఛన్, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ (టీఎస్‌జేయూ) ప్రభుత్వాన్ని కోరింది.

ఈ మేరకు నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ శాశ్వత పింఛన్ పథకం అమలు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, సానుకూల నిర్ణయం తీసుకునేలా సిఫారసు చేయాలని ఆమెను కోరారు.

ఈ సందర్భంగా మెరుగు చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు ప్రభుత్వ దృష్టికి ప్రజల ఇబ్బందులను తీసుకెళ్లడంలో వారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

అయితే ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పత్రికలు, స్థానిక మీడియా సంస్థల్లో పని చేస్తున్న అనేక మంది జర్నలిస్టులు పదవీ విరమణ అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ, జీవన భద్రత కోసం వారికి శాశ్వత భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

టీఎస్‌జేయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, మీడియా సంస్థలకు వచ్చే అర్హత కలిగిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ప్రకటనల ఆదాయంలో 10 శాతం మొత్తాన్ని జర్నలిస్టుల పింఛన్, సంక్షేమ నిధికి కేటాయించాలని కోరారు. దీనికి అదనంగా తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా మరో 3 శాతం నిధులను సమకూర్చాలని కోరారు.

ఈ విధంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే జర్నలిస్టులకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు. టీఎస్‌జేయూ రాష్ట్ర నాయకులు, తెలుగు ప్రభ జిల్లా ప్రతినిధి చాప రవీందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల పింఛన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి పారదర్శకంగా లెక్కలు నిర్వహించాలని, ఏటా ఆడిట్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులతోపాటు పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు సైతం వర్తించేలా సమగ్ర పింఛన్ పథకాన్ని రూపొందించాలని కోరారు. ఈ పథకం అర్హతలు, పింఛన్ మొత్తం, అమలు విధివిధానాలను రూపొందించేందుకు సీనియర్ సంపాదకులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

చిన్న, మధ్య, పెద్ద వార్తాపత్రికలు, వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి సంఘపరమైన వివక్ష లేకుండా సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి ముఖ్యమంత్రి, సంబంధిత ప్రభుత్వ శాఖలకు సిఫారసు చేయాలని ఆమెను కోరారు.

జర్నలిస్టుల కోసం జర్నలిస్టులే.. జర్నలిస్టుల సంక్షేమం కోసం సమిష్టి పోరాటం అనే నినాదంతో జర్నలిస్టులందరికీ సామాజిక భద్రత కల్పించేందుకు ఈ ప్రయత్నం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ (టీఎస్‌జేయూ) నాయకులు బివిఎస్ చలపతి నాయుడు, పలుగుల పవన్, బుడంపల్లి నిరంత గౌడ్, ఎం. విష్ణు మోహన్, వెంకటాపురం రవి తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA