Ghatkesar: లాల్‌–నీలి ఐక్యతే సామాజిక మార్పునకు బలం: పుట్ట లక్ష్మణ్!

Ghatkesar: ఘట్‌కేసర్‌లో ప్రబుద్ధ భారత్ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు 290వ పూలమాల కార్యక్రమం జరిగింది. లాల్-నీలి ఐక్యతతోనే సామాజిక మార్పు సాధ్యమని ఏఐఎస్ఎఫ్ నేత పుట్ట లక్ష్మణ్ అన్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 1 Nov 2026 8:04 PM IST
Ghatkesar
X

Ghatkesar: లాల్‌–నీలి ఐక్యతే సామాజిక మార్పునకు బలం: పుట్ట లక్ష్మణ్!

ఘట్‌కేసర్‌: ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లాల్‌–నీలి ఐక్యతతో ఉద్యమించాలని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌) జాతీయ ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. రాజ్యాధికారం అంటే పదవులు అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేస్తూ వారి సమస్యలను పరిష్కరించడమేనని పేర్కొన్నారు.

ప్రబుద్ధ భారత్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన 290వ వారపు నిత్య పూలమాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు ప్రజల హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకొచ్చే శక్తిమంతమైన సాధనమన్నారు.

అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగ విలువల స్ఫూర్తితో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్‌ ఒక కులానికో, వర్గానికో పరిమితమైన నాయకుడు కాదని, దేశానికి మార్గదర్శకుడని కొనియాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, అర్హులకు ఉపకార వేతనాలు, పేదలకు ఉచిత వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణానికి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్‌ ఆశయాల వ్యాప్తికి నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్న అరుణ్‌కుమార్‌ను అభినందించారు. అనంతరం అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్‌ చేసిన కృషిని వివరించారు. 1948 నవంబరు 4న రాజ్యాంగ పరిషత్తులో ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేక దశల్లో చర్చలు, సవరణలు జరిగాయని తెలిపారు.

దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన అంబేద్కర్‌ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా సూక్తి శివకృష్ణ మాట్లాడుతూ.. విజ్ఞానం, నిజాయితీ, సమతాభావంతో సమాజాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలని అంబేద్కర్‌ ఆశయాలను గుర్తుచేశారు. కార్యక్రమంలో కె. నర్సింగ్‌రావు, కె. సత్యం, అంబేద్కర్‌ యువజన సంఘం ఘట్‌కేసర్‌ ప్రధాన కార్యదర్శి ఈరిటం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకుడు ఎం.ఏ. రెహమాన్‌, మంచాల విజయ్‌, సి. ఆనంద్‌, కడుపోల నర్సింగ్‌రావు, ఎండీ అన్వర్‌, గంగారం అంజయ్య, కె. చింటు, సాయి కుమార్‌, పి. కృష్ణ, బల్వంత్‌రావు, ఈ. విష్ణు, శివకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL