Cyberabad: మాదాపూర్‌లో డ్రగ్స్ గుట్టురట్టు ముగ్గురు అరెస్ట్!

Cyberabad: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 1 గ్రాము MDMA, ఫోన్లు స్వాధీనం.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 14 Oct 2026 7:32 PM IST
Cyberabad
X

Cyberabad: మాదాపూర్‌లో డ్రగ్స్ గుట్టురట్టు ముగ్గురు అరెస్ట్!

Cyberabad: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో డ్రగ్స్ గుట్టు రట్టయింది. ఎండీఎంఏ (MDMA) వంటి మహమ్మారిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డ్రగ్స్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

అక్టోబర్ 13వ తేదీ మధ్యాహ్నం 3:10 గంటల ప్రాంతంలో మాదాపూర్ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు... సిద్ది వినాయక నగర్‌లోని రాజ్ టవర్స్ సమీపంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుపుతున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.

నిందితుల వివరాలు:

కట్ల మాధవ్ @ టోనీ (25): బంజారాహిల్స్ నివాసి, ఈ కేసులో ప్రధాన డ్రగ్స్ విక్రేత (A1).

నామాల సిద్ధార్థ్ (25): మాదాపూర్ నివాసి, డ్రగ్స్ సబ్ పెడ్లర్ (A2).

ఎరుగు లోకేష్ (26): బంజారాహిల్స్ నివాసి, డ్రగ్స్ వినియోగదారుడు (A3).

బెంగళూరు నుంచి సరఫరా:

ప్రధాన నిందితుడు మాధవ్ బెంగళూరుకు వెళ్లి అక్కడొక పరిచయం లేని వ్యక్తి వద్ద 1 గ్రాము ఎండీఎంఏ డ్రగ్స్‌ను రూ.6,000లకు కొనుగోలు చేశాడు. దానిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, సిద్ధార్థ్‌కు రూ.10,000లకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సిద్ధార్థ్ ద్వారా లోకేష్‌తో పాటు మరికొందరికి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితుల నుంచి 1 గ్రాము ఎండీఎంఏ డ్రగ్స్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.1605/2026, U/s 8(c) r/w 22(a) & 27 NDPS Act కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెట్‌వర్క్‌ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY