Cherlapally: చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించిన సివిల్స్ శిక్షణార్థులు!
Cherlapally: ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థకు చెందిన 190 మంది ఆల్ ఇండియా, సివిల్ సర్వీస్ శిక్షణార్థుల బృందం చర్లపల్లి జైలు, ఖైదీల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించింది.
Cherlapally: చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించిన సివిల్స్ శిక్షణార్థులు!
Cherlapally: డాక్టర్ ఎం.సి.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణకు చెందిన 190 మంది సభ్యుల బృందం బుధవారం చర్లపల్లి కేంద్ర కారాగారం, ఖైదీల వ్యవసాయ క్షేత్రాన్ని (పీఏసీ)ని సందర్శించారు అఖిల భారత సర్వీసులు, కేంద్ర సివిల్ సర్వీసుల అధికారుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. ఈ బృందంలో 175 మంది అధికార శిక్షణార్థులు ఉండగా, వారిలో 60 మంది మహిళలు, 115 మంది పురుషులు ఉన్నారు. వీరితో పాటు 15 మంది అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ బృందంలో భారత అటవీ సేవ (ఐఎఫ్ఓఎస్)కు చెందిన 44 మంది, భారత పోలీసు సేవ (ఐపీఎస్)కు చెందిన 20 మంది, భారత రెవెన్యూ సేవ (ఐఆర్ఎస్)కు చెందిన 39 మంది, భారత గణాంక సేవ (ఐఎస్ఎస్)కు చెందిన 34 మంది, భారత ఆర్థిక సేవ (ఐఈఎస్)కు చెందిన 12 మంది అధికారులు ఉన్నారు. వీరితో పాటు భారత ఆడిట్, అకౌంట్స్ సేవ (ఐఏ అండ్ ఏఎస్)కు చెందిన ఐదుగురు, భారత సమాచార సేవ (ఐఐఎస్)కు చెందిన ఐదుగురు, భారత పౌర అకౌంట్స్ సేవ (ఐసీఏఎస్)కు చెందిన ముగ్గురు, భారత కార్పొరేట్ న్యాయ సేవ (ఐసీఎల్ఎస్)కు చెందిన ఒకరు, భారత రక్షణ అకౌంట్స్ సేవ (ఐడీఏఎస్)కు చెందిన ఒకరు, భారత రైల్వే మేనేజ్మెంట్ సేవ (ఐఆర్ఎంఎస్)కు చెందిన నలుగురు, పోస్టల్ సంబంధిత సేవలకు చెందిన ముగ్గురు, భారత పోస్టులు, టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సేవకు చెందిన ఇద్దరు అధికారులు ఉన్నారు.
ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం జైళ్ల పరిపాలన, భద్రతా ఏర్పాట్లు, ఖైదీల నిర్వహణ, దిద్దుబాటు చర్యలు, పునరావాస కార్యక్రమాలపై అధికార శిక్షణార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడం. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్లు, శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్, శిక్షణార్థులకు స్వాగతం పలికి జైళ్ల శాఖ విధులు, లక్ష్యాలను వివరించారు. జైళ్లు కేవలం ఖైదీలను నిర్బంధించే కేంద్రాలు మాత్రమే కావని, వారిలో మార్పు తీసుకువచ్చి, తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా తీర్చిదిద్దే సంస్కరణ, పునరావాస కేంద్రాలని ఆమె పేర్కొన్నారు. జైళ్లలో భద్రత, క్రమశిక్షణను కాపాడటంతో పాటు ఖైదీలకు విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిలో సానుకూల మార్పు తీసుకురావడానికి శాఖ కృషి చేస్తోందని తెలిపారు.
తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను అధికారులు శిక్షణార్థులకు వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ద్వారా ఖైదీలకు విద్యను అందించడం, చెర్లపల్లి కేంద్ర కారాగారంలో ఐటీఐ కళాశాల ఏర్పాటు, జైలు పరిశ్రమల ద్వారా స్టీల్ ఫర్నిచర్, ఫినాయిల్, సబ్బులు, హ్యాండ్వాష్, శానిటైజర్ల తయారీ వంటి కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా వడ్రంగం, పాడి పరిశ్రమ, కూరగాయల సాగు, ఇంధన విక్రయ కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ఖైదీల్లో పని నైపుణ్యాలు, బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు విడుదల అనంతరం స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం శిక్షణార్థులు ఖైదీల వ్యవసాయ కాలనీని సందర్శించి అక్కడ అమలవుతున్న బహిరంగ జైలు విధానం గురించి తెలుసుకున్నారు. ఈ విధానంలో ఖైదీలకు ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, వారిలో స్వీయ క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించడం, సమాజంలో తిరిగి కలిసిపోయేందుకు అవసరమైన లక్షణాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై అవగాహన పొందారు.
పర్యటన సందర్భంగా పలువురు అధికార శిక్షణార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న విద్యా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, జైలు పరిశ్రమలు, ఖైదీల సంస్కరణ, పునరావాస కార్యక్రమాలను అభినందించారు. జైళ్ల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఖైదీల భద్రతతో పాటు వారి చట్టపరమైన హక్కులు, మానవ గౌరవం, వ్యక్తిత్వ పరివర్తనకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్శన ద్వారా గుర్తించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.సి.ఆర్. హెచ్ఆర్డీ సంస్థ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ కె. సుకుమార్, జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ డి. శ్రీనివాస్, చెర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ జి. ప్రమోద్, ఖైదీల వ్యవసాయ కాలనీ సూపరింటెండెంట్ డి. భరత్, డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎ. వెంకటేశం, ఎల్. దేవ్లా, వి. శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.




