Malkajgiri: మౌలాలి, మల్కాజిగిరి సర్కిళ్లలో కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు!
Malkajgiri: మౌలాలి, మల్కాజిగిరి సర్కిళ్లలో కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి విస్తృత తనిఖీలు. బండ చెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు, పౌర సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు.
Malkajgiri: మౌలాలి, మల్కాజిగిరి సర్కిళ్లలో కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు!
మల్కాజిగిరి, సెప్టెంబరు 19: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం మౌలాలి, మల్కాజిగిరి సర్కిళ్లలో ఆయన విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.
మౌలాలి వార్డులో రోడ్డు ప్యాచ్ పనులకు వినియోగించే షెల్ మ్యాక్ బ్యాగుల నిల్వ, కొత్త స్ట్రీట్ లైట్ల స్టాక్‌తో పాటు ఇతర పరికరాల నిర్వహణను కమిషనర్ పరిశీలించారు. అందుబాటులో ఉన్న సామగ్రిని అవసరమైన ప్రాంతాల్లో సకాలంలో వినియోగించాలని, పరికరాలను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వెంకటేశ్వరనగర్‌లో స్థానిక ప్రజలతో మాట్లాడిన కమిషనర్ రాత్రివేళల్లో స్ట్రీట్ లైట్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. ప్రజల భద్రత, రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు కోసం అవసరమైన చోట స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీన్‌దయాల్‌నగర్ రోడ్డులో జరుగుతున్న చెట్ల కొమ్మల తొలగింపు, బకెట్ ల్యాడర్ పనులను పరిశీలించిన ఆయన.. ప్రధాన రహదారులు, రోడ్డు మార్జిన్లలో ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించే కొమ్మలను సకాలంలో తొలగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని, మానవ వనరులు, పరికరాలను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.
అనంతరం బండ చెరువు బేబీ పాండ్‌ను పరిశీలించిన కమిషనర్ గణేష్ నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అవసరమైన సౌకర్యాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజల భద్రత, రాకపోకలు, జన సమూహాల నియంత్రణ, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ పర్యటనలో డీసీ బాలకృష్ణ ప్రసాద్, ఎస్‌ఈ లక్ష్మణ్, డీఈ, ఏఈ, టౌన్ ప్లానింగ్, యూబీడీ, రామ్‌కీ, ఈపీటీఆర్‌ఐ అధికారులు పాల్గొన్నారు.




