Malkajgiri: మల్కాజిగిరిలో జీహెచ్‌ఎంసీ కార్మికుడిపై బెల్ట్‌షాప్ దాడి

Malkajgiri: మల్కాజిగిరి పటేల్‌నగర్‌లో అక్రమ మద్యం డంప్ చేస్తుండగా దారి అడిగినందుకు జీహెచ్‌ఎంసీ కార్మికుడిపై బెల్ట్‌షాప్ నిర్వాహకులు దాడి చేసి గాయపరిచారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 25 Sept 2026 3:09 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో జీహెచ్‌ఎంసీ కార్మికుడిపై బెల్ట్‌షాప్ దాడి

మల్కాజిగిరి: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా వైన్‌ షాపులు మూసివేసిన సమయంలో మల్కాజిగిరి పటేల్‌నగర్‌లో బెల్ట్‌షాప్‌ నిర్వాహకులు అక్రమంగా మద్యం విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బెల్ట్‌షాప్‌ వద్దకు ఆటోలో మద్యం తీసుకొచ్చి డంప్‌ చేస్తున్న సమయంలో కాలనీలోకి వెళ్లే మార్గంలో వాహనాలు అడ్డంగా ఉండటంతో హారన్‌ కొట్టి దారి ఇవ్వాలని కోరిన జీహెచ్‌ఎంసీ కార్మికుడు శ్రీధర్‌పై నిర్వాహకులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఘటనలో బెల్ట్‌షాప్‌ నిర్వాహకులతో పాటు వారి కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేసి కర్రలతో, పిడిగుద్దులతో కొట్టారని తెలిపారు. దళితులను దుర్భాషలాడారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని బాధితులు పేర్కొన్నారు.

బెల్ట్‌షాప్‌ నిర్వాహకుల కారణంగా కాలనీలో మహిళలు, స్థానికులకు భద్రత లేకుండా పోయిందని, అక్రమ మద్యం విక్రయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రతి సంవత్సరం గణేష్‌ నిమజ్జనం వంటి సందర్భాల్లో బెల్ట్‌షాప్‌ వద్ద ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్‌, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

దాడికి పాల్పడిన వారే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాప్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri