Hyderabad: మలక్‌పేటలో మహిళపై కత్తితో దాడి, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్ట్!

Hyderabad: మలక్‌పేట గడ్డిఅన్నారంలో ఒంటరి మహిళపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరు పాత నేరస్థులతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 3 Nov 2026 5:16 PM IST
Hyderabad
X

Hyderabad: మలక్‌పేటలో మహిళపై కత్తితో దాడి, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్ట్!

Hyderabad: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగుడు తప్పుడు కారణంతో ఇంట్లోకి ప్రవేశించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె నుంచి సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన మలక్ పేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే పదుల సంఖ్యలో నేరాల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థులు కావడం గమనార్హం.

ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీలో అక్టోబర్ 27న సాయంత్రం 4.30 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తప్పుడు కారణం చెప్పి మహిళ నివాసముంటున్న ఫ్లాట్ లోకి ప్రవేశించాడు.

అనంతరం ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె వద్ద ఉన్న వన్ ప్లస్ సెల్ ఫోన్ ను అపహరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సాక్షులను విచారిస్తూ నిందితుడి ఆచూకీ గుర్తించారు. ఈ క్రమంలో నవంబర్ 2న గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా చోరీ సొత్తును స్వీకరించడం, విక్రయించడం వంటి కార్యకలాపాల్లో భాగస్వాములైన మరో ఇద్దరి వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో కేసరి మణికంఠ అలియాస్ మున్నాపై గతంలో సుమారు 59 కేసులు, నారపోగు వంశీకృష్ణపై సుమారు 39 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులున్నాయి.

మిర్యాలగూడ, సూర్యాపేట, నల్గొండ, ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. మూడో నిందితుడు అజయ్ కుమార్ సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్ సమీపంలో అజామ్ మిలన్ గార్మెంట్స్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

నిందితుల నుంచి బాధితురాలికి చెందిన వన్ ప్లస్ ఫోన్ తో పాటు వివిధ కంపెనీలకు చెందిన మరో 22 సెల్ ఫోన్లు, చోరీ కేసులతో సంబంధమున్న మూడు ద్విచక్ర వాహనాలు, నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న స్టీల్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చోరీ కేసులతో ఈ వాహనాలు, ఫోన్లకు ఉన్న సంబంధాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

మలక్ పేట పరిధిలో నమోదైన కేసుతో పాటు సైదాబాద్, సరూర్ నగర్, చైతన్యపురి, చిలకలగూడ, నాచారం, ఉప్పల్, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు కేసుల్లోనూ నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని నేరాలతో సంబంధాలు, ఇతర చోరీ సొత్తు ఆచూకీపై విచారణ చేస్తున్నట్లు ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి వెల్లడించారు.

డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అదనపు డీసీపీ ఎం. మజీద్ పర్యవేక్షణలో మలక్ పేట ఎస్ హెచ్ ఓ కె. వెంకట్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ధర్మారెడ్డి గిరి, క్రైమ్ బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA