LB Nagar: ఆటోనగర్ డంపింగ్ యార్డును సందర్శించిన మధుయాష్కి గౌడ్!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గం ఆటోనగర్ డంపింగ్ యార్డును మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి మధుయాష్కి గౌడ్.
LB Nagar: ఆటోనగర్ డంపింగ్ యార్డును సందర్శించిన మధుయాష్కి గౌడ్!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్ డంపింగ్ యార్డును ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మధుయాష్కి గౌడ్ మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసనతో చుట్టుపక్కల సుమారు 20 కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దుర్వాసన కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రెండు డివిజన్ల నుంచి సేకరించిన చెత్తను మాత్రమే తరలించాల్సి ఉండగా, సుమారు 20 డివిజన్ల నుంచి చెత్తను ఆటోనగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో యార్డులో చెత్త భారీగా పేరుకుపోయి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను జవహర్‌నగర్‌కు తరలించాల్సిన రాంకీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మధుయాష్కి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని పేర్కొంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నెల రోజుల్లో చెత్తను పూర్తిగా తరలించాలి
డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను దశలవారీగా కాకుండా వేగంగా తరలించి, నెల రోజుల్లో పూర్తిగా ఖాళీ చేయాలని కాంట్రాక్టర్, రాంకీ సంస్థ సిబ్బంది, సంబంధిత అధికారులకు మధుయాష్కి గౌడ్ సూచించారు. చెత్త తరలింపు పూర్తయ్యే వరకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
అలాగే, జంతు కళేబరాలను డంపింగ్ యార్డులో యథేచ్ఛగా పడవేయకుండా, నిబంధనల ప్రకారం పూడ్చిపెట్టేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.




