LB Nagar: తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. 7 చోట్ల చోరీలు: నిందితుడి అరెస్ట్!
LB Nagar: తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని 7 చోట్ల దొంగతనాలకు పాల్పడిన నిందితుడు చరణ్ విఘ్నేశ్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
LB Nagar: తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. 7 చోట్ల చోరీలు: నిందితుడి అరెస్ట్!
ఎల్‌బీనగర్: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అలవాటు నేరస్థుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలానికి చెందిన యర్రం శెట్టి చరణ్ విఘ్నేశ్ అలియాస్ చరణ్ (25) హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉంటున్నాడు.
దసరా పండుగ సందర్భంగా ఈ నెల 17న వనస్థలిపురం విజయపురి కాలనీ ఫేజ్-1కు చెందిన జనార్దన్‌రావు ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 22న తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటంతో పాటు బీరువాలు చిందరవందరగా కనిపించాయి. సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డులు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోరీలకు పాల్పడేది ఇలా..
నిందితుడు రాత్రివేళ ద్విచక్రవాహనంపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత చిన్న ఇనుపరాడ్డుతో తలుపుల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. బీరువాలను ధ్వంసం చేసి బంగారం, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించేవాడు. అనంతరం వాటిని విక్రయించి విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఏడు కేసుల్లో పాత్ర..
నవంబర్ 5న సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్జీవోస్ కాలనీలోని ఓ నగల దుకాణం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని క్రైమ్ టీమ్ అదుపులోకి తీసుకుంది. విచారణలో కీసర పోలీస్‌స్టేషన్‌లో మూడు, సరూర్‌నగర్‌లో ఒకటి, వనస్థలిపురంలో మూడు.. మొత్తం ఏడు ఇళ్ల దొంగతనం కేసుల్లో తన పాత్రను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి నుంచి 26 గ్రాముల బంగారు ఆభరణాలు (11 గ్రాముల ఉంగరం, 15 గ్రాముల చెవి కమ్మలు, మట్టెలు), వన్‌ప్లస్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ సీపీ బి.సుమతి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, ఎల్‌బీనగర్ డీసీపీ బి.అనురాధ పర్యవేక్షణలో జరిగింది. ఏసీపీ టి.కరుణాకర్‌రావు, వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ ఎస్.రవిబాబు, డీఐ బి.రాజేష్, డీఎస్‌ఐ వి.రవి, క్రైమ్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.




