Kushaiguda: బాలల హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన అవసరం: ఏఎస్ఐ

Kushaiguda: బాలల దినోత్సవం సందర్భంగా ఈసీఐఎల్‌లో ఏఐవైఎఫ్–బాల సంఘం నిర్వహించిన పోటీల విజేతలకు కుషాయిగూడా ఏఎస్ఐ గోపాల్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.

ASHOK, KAPRA
Published on: 13 Nov 2026 7:11 PM IST
Kushaiguda
X

Kushaiguda: బాలల హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన అవసరం: ఏఎస్ఐ

Kushaiguda: బాలల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చట్టాల అమలుతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడం ఎంతో అవసరమని కుషాయిగూడా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గోపాల్ రెడ్డి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) – బాల సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్లోని నీలం రాజశేఖరరెడ్డి భవన్‌లో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా కుషాయిగూడా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులు, వాటి పరిరక్షణకు అమలులో ఉన్న చట్టాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A, విద్యా హక్కు చట్టం, పోక్సో చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, బాల్యవివాహ నిరోధక చట్టాల గురించి వివరించారు. బాలలపై జరిగే హింస, దోపిడీ, వివక్ష, బాల కార్మికత్వాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజం సమిష్టిగా బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

అదే విధంగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు బాల సంఘం జాతీయ కన్వీనర్ కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలు అందాలని అన్నారు. బాల్యం పనుల కోసం కాదని, చదువులు, ఆటపాటలు, సృజనాత్మకత కోసం అనే సందేశాన్ని సమాజమంతా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ ఆశయాల స్ఫూర్తితో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, సమానత్వ భావన, సామాజిక బాధ్యతను పెంపొందించడమే బాల సంఘం లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి గిరి బాబు, బాల సంఘం జిల్లా కన్వీనర్ రాజ్ కుమార్, నేతలు కిరణ్, శేఖర్, నదీమ్, ఇంతియాజ్, ఏఐఎస్ఎఫ్ ఉప్పల్ మండల అధ్యక్షుడు, కార్యదర్శి అజీమ్ పాషా, మహేష్ బాబు లతో పాటు వివిధ పాఠశాలల విజేతలు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA