LB Nagar: ఎల్బీనగర్ పోలీసుల చాకచక్యం 15 హోండా యాక్టివాలు స్వాధీనం!

LB Nagar: ఎల్బీనగర్ పోలీసుల చాకచక్యంతో ఇద్దరు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్. వారి నుంచి 15 హోండా యాక్టివా స్కూటర్లు స్వాధీనం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 17 Oct 2026 7:30 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్ పోలీసుల చాకచక్యం 15 హోండా యాక్టివాలు స్వాధీనం!

ఎల్బీనగర్: మెట్రో స్టేషన్ల పార్కింగ్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 హోండా యాక్టివా స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. మాస్టర్ కీ సాయంతో వాహనాలను దొంగిలించి, వాటిని వనస్థలిపురం పరిసరాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుల చోరీల పంథా ఇదీ!

ప్రధాన నిందితుడు తంగుటూరి సంజీవ కుమార్ (46) గతంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో సైబర్ కేసులో అరెస్టయ్యాడు. జైల్లో పరిచయమైన మల్లాడ గంగాధర్ శ్రీ నాగవర్మ (49)తో కలిసి వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్రో స్టేషన్ల పార్కింగ్ ప్రాంతాల్లో తిరుగుతూ, మాస్టర్ కీ సాయంతో పార్క్ చేసిన హోండా యాక్టివా స్కూటర్లను చోరీ చేసేవారు. అనంతరం వాటిని పరిచయస్తులకు విక్రయించి, వచ్చిన డబ్బును ఇద్దరూ సమానంగా పంచుకునేవారనీ తెలిపిన ఎల్బీనగర్ ఏసిపి రవీందర్ రెడ్డి

సీసీటీవీ ఆధారంగా పట్టివేత

ఈ నెల 10న ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో తన హోండా యాక్టివా స్కూటర్‌ను పార్క్ చేసిన ఐటీ ఉద్యోగి తాళం చెవిని వాహనం వద్దే మరిచిపోయాడు. తిరిగి వచ్చేసరికి స్కూటర్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ క్రైమ్ టీమ్ సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించి, ఆధారాల సాయంతో నిందితుల ఆచూకీ గుర్తించింది. అక్టోబర్ 17న ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 15 స్కూటర్లను స్వాధీనం చేసుకుందనీ తెలిపిన ఏసిపి

పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలు

నిందితులకు ఎల్బీనగర్, మీర్‌పేట్, అఫ్జల్‌గంజ్, జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన వాహన చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో రెండు స్కూటర్లకు సంబంధించి ఫిర్యాదుదారులను గుర్తించాల్సి ఉంది.

వాహనదారులకు పోలీసుల సూచనలు చేసిన ఎల్బీనగర్ ఏసిపి రవీందర్ రెడ్డి

- వాహనాలను అధికారిక, వెలుతురు ఉండే పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలి.

- తాళం చెవిని వాహనం వద్ద వదిలిపెట్టకూడదు.

- హ్యాండిల్ లాక్‌తో పాటు అదనపు యాంటీ థెఫ్ట్ పరికరాలు ఉపయోగించాలి.

- వీలైతే జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను అమర్చుకోవాలి.

- పార్కింగ్ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా 112కు సమాచారం ఇవ్వాలి.

నిందితులను వేగంగా పట్టుకుని, చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్న ఎల్బీనగర్ పోలీస్ క్రైమ్ టీమ్‌ను పోలీస్ అధికారులు అభినందించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR