LB Nagar: మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ దుర్వాసనపై ఎమ్మెల్యే పర్యటన!
LB Nagar: మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ.
LB Nagar: మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ దుర్వాసనపై ఎమ్మెల్యే పర్యటన!
LB Nagar: మన్సూరాబాద్ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని స్థానికులు కోరారు. శుక్రవారం డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 20 కాలనీల వాసులతో కలిసి ఎమ్మెల్యే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి వెంకట నరసయ్య పర్యటించి సమస్యలను పరిశీలించారు.
డంపింగ్ యార్డ్ నుంచి రక్తం, కొవ్వు పదార్థాలు, మురుగునీరు వెలువడటంతో దుర్వాసన వ్యాపిస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, వృద్ధులు శ్వాసకోశ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో పలు చర్యలు చేపట్టాం: సుధీర్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రూ.6 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్‌లోకి వివిధ ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి వదులుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామని చెప్పారు. చెత్తను అక్రమంగా పారవేసే లారీలను గుర్తించి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు.
హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్, హైలా తదితర శాఖల అధికారులతో మాట్లాడి నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించేందుకు ట్యాంకర్లు, మోటార్లు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. జంతు కళేబరాలు, ఇతర వ్యర్థాలు పారవేసే వారిపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్, ఫర్టిలైజర్ గోడౌన్లు, మెకానికల్ షెడ్లను తనిఖీ చేసి డ్రైనేజీ లైన్ల ద్వారా రసాయనాలు, వ్యర్థాలు వదులుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అక్కడ వాచ్‌మెన్‌ను నియమించడంతో పాటు ఎస్టీపీ ప్లాంట్లు కూడా నిర్మించినట్లు గుర్తుచేశారు.
ఇప్పటివరకు దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేయలేదంటూ కొన్ని గ్రూపుల్లో విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా డంపింగ్ యార్డ్ పరిసర కాలనీల ప్రజలకు దుర్వాసన సమస్య నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, టంగుటూరి నాగరాజు, జగదీష్ యాదవ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, సంతోష్ గుప్తా, రవి, బాలరాజుతో పాటు ప్రభావిత కాలనీల అధ్యక్షులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.




