LB Nagar: రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్
LB Nagar: బండ్లగూడ నయీమ్ హత్య కేసులో కీలక పరిణామం. ప్రధాన సూత్రధారి ఉమా మహేష్‌తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మంలో ప్లాన్ చేసి హత్య.
LB Nagar: రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్
ఎల్బీనగర్: బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఉమా మహేష్‌తో పాటు మరో ఇద్దరిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన వారిలో ఖమ్మంకు చెందిన కె. ఉమా మహేష్ అలియాస్ జేకే మహేష్ (34), సాయినగర్‌కు చెందిన మహమ్మద్ మున్నా అలియాస్ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దుగ్గిరాల కార్తీక్ (29) ఉన్నారు.
ఈ నెల 14న బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో నయీమ్‌పై వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురి అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య 11కు చేరింది.
బాల్య స్నేహితుల మధ్య విభేదాలు
నయీమ్, ఉమా మహేష్ బాల్య స్నేహితులని పోలీసులు తెలిపారు. చిన్నతనం నుంచే నేరచరిత్ర ఉండటంతో ఇద్దరిపై ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కొంతకాలంగా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల వ్యవహారాల్లో తిరిగిన ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి కక్షగా మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఖమ్మంలో ప్లాన్.. హైదరాబాద్‌లో హత్య
నయీమ్‌ను హత్య చేసేందుకు ఈ నెల 13న ఖమ్మంలోని ఓ హోటల్లో ఉమా మహేష్ తన అనుచరులతో కలిసి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఖమ్మం నుంచి కారులో హైదరాబాద్‌కు చేరుకున్న నిందితులు.. మున్నా ద్వారా నయీమ్‌కు ఫోన్ చేసి అతడి ఆచూకీ తెలుసుకున్నారు.
బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో నయీమ్ ఉన్నట్లు నిర్ధారించుకున్న అనంతరం అక్కడికి చేరుకున్నారు. వైన్స్ వద్ద నయీమ్ కళ్లలో కారం చల్లి వెంబడించి.. సిట్టింగ్ ఏరియాలో వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రత్యేక బృందాలతో గాలింపు
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎల్బీనగర్ డీసీపీ బి. అనురాధ ఐపీఎస్, ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.
ఈ క్రమంలో ప్రధాన సూత్రధారి ఉమా మహేష్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.




