LB Nagar: తిరుమల గది బుకింగ్ పేరిట సైబర్ మోసం.. రూ.1.86 లక్షలు లూటీ!

LB Nagar: తిరుమలలో వసతి గది బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికిన వనస్థలిపురం వ్యాపారిని నకిలీ వెబ్‌సైట్‌, రిఫండ్ లింక్ ద్వారా నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.1.86 లక్షలు కాజేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 27 Nov 2026 8:08 AM IST
LB Nagar
X

LB Nagar: తిరుమల గది బుకింగ్ పేరిట సైబర్ మోసం.. రూ.1.86 లక్షలు లూటీ!

ఎల్బీనగర్: తిరుమలలో వసతి గది బుక్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో వెతికిన ఓ వ్యాపారి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. నకిలీ వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా బుకింగ్‌ పేరుతో నమ్మించి.. రిఫండ్‌ లింక్‌ పంపి రూ.1.86 లక్షలు కాజేశారు. వనస్థలిపురంలోని నరసింహారావునగర్‌కు చెందిన టి.రామలింగేశ్వరరావు (59) ఈ మోసంపై ఎల్బీనగర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 24న కుటుంబ సభ్యుల కోసం తిరుమలలో వసతి గది బుక్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా.. పుష్పగిరి మఠం వసతి బుకింగ్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ కనిపించింది. అందులోని ‘బుక్‌ నౌ’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయడంతో ఓ వాట్సాప్‌ నంబర్‌ వచ్చింది. అవతలి వ్యక్తి గది ఫొటోలు, అద్దె వివరాలు పంపించి బుకింగ్‌ కోసం డబ్బులు చెల్లించాలని కోరాడు.

అతడి మాటలు నమ్మిన బాధితుడు తొలుత మూడుసార్లు రూ.2 వేల చొప్పున చెల్లించారు. అనంతరం యూనియన్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.6,560, ఎస్‌బీఐ ఖాతా నుంచి ఫోన్‌పే ద్వారా రూ.6,516 చెల్లించారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి అభిలాష్‌ పేరుతో మరో వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను మేనేజర్‌నని పరిచయం చేసుకుని రిఫండ్‌ లింక్‌ పంపించాడు.

నమ్మకం కలిగించేందుకు బాధితుడి ఖాతాకు రూ.5 బదిలీ చేశాడు. దీంతో లింక్‌ నిజమైనదేనని భావించి దాన్ని తెరవడంతో ఖాతాలోని రూ.1,86,289 మాయమయ్యాయి. మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల హెచ్చరిక

తిరుమల వసతి బుకింగ్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్లు, ధ్రువీకరించిన మార్గాలనే వినియోగించాలి. గూగుల్‌లో కనిపించే ప్రతి వెబ్‌సైట్‌ అధికారికమైనదని నమ్మవద్దు. వాట్సాప్‌ ద్వారా వచ్చే అపరిచితుల బుకింగ్‌ ఆఫర్లు, చెల్లింపు లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు తిరిగి పొందేందుకు రిఫండ్‌ లింక్‌ తెరవాలని, ఓటీపీ చెప్పాలని అడిగితే నమ్మవద్దు.

బ్యాంకు వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్‌ ఎవరికీ వెల్లడించవద్దు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి, cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. అప్రమత్తతే సైబర్‌ మోసాలకు రక్షణ.. అత్యాశకు, ఆన్‌లైన్‌ తొందరపాటుకు దూరంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR