LB Nagar: ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

LB Nagar: ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఈసీ తీరును తప్పుబట్టారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 30 Sept 2026 4:35 PM IST
LB Nagar
X

LB Nagar: ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

ఎల్బీనగర్: ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఎం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల నిబంధనల పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారని, ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లు, పేదలు సహా వివిధ వర్గాల ఓటర్ల హక్కులను దెబ్బతీసే విధంగా చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ తక్షణమే రాజీనామా చేయాలని చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. 2023లో తీసుకొచ్చిన నూతన ఎన్నికల విధానాలు, నిబంధనలను పునఃపరిశీలించి ప్రజాస్వామ్యానికి అనుగుణంగా మార్పులు చేయాలని కోరారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామెల్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు అవకాశం కల్పించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, పోలింగ్ శాతం, అనంతరం నమోదైన ఓట్ల వివరాలపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఉద్యమించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి బోడ సామెల్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి, రవీంద్ర శర్మ, సరోూర్‌నగర్ సర్కిల్ కార్యదర్శి సీహెచ్ వెంకన్న, ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR