LB Nagar: ప్రోటోకాల్ రగడపై సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కౌంటర్

LB Nagar: ఎల్బీనగర్ ప్రోటోకాల్ వివాదంపై దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కౌంటర్; మధు యాష్కీకి మద్దతుగా సుజాత నాయక్, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఫైర్.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 Nov 2026 6:05 PM IST
LB Nagar
X

LB Nagar: ప్రోటోకాల్ రగడపై సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కౌంటర్

ఎల్బీనగర్: ఇటీవల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించని సుధీర్ రెడ్డి ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.

హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ఘాటు వ్యాఖ్యలు

హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి ఒక గల్లీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మధు యాష్కీ గౌడ్ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను ప్రశ్నించే స్థాయి సుధీర్ రెడ్డికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎల్బీనగర్ ప్రజలు చదువుకు, విద్యావంతులైన నాయకులకు విలువ ఇవ్వాలని సూచించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా మధు యాష్కీ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొన్నారు.

2009 నుంచే ప్రోటోకాల్ వివాదం ఉంది: ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి

మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్‌లో ప్రోటోకాల్ వివాదం కొత్తదేమీ కాదని, 2009 నుంచే ఈ సమస్య కొనసాగుతోందని తెలిపారు. అప్పట్లో టీడీపీ కార్పొరేటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులను కూడా అవమానించిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు.

తాను ప్రెస్‌మీట్ నిర్వహించడానికి కారణం గతంలో జరిగిన సంఘటనలను ప్రజలకు, మీడియాకు తెలియజేయడమేనని చెప్పారు. ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం ఉందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు కీలక నిర్ణయాధికారం ఉంటుందని వివరించారు.

ఇన్‌చార్జి మంత్రి హాజరుకాకుండానే కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ప్రోటోకాల్ గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో జరిగిన పలు ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలిస్తే ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

రాజకీయంగా వేడెక్కుతున్న ఎల్బీనగర్

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో మొదలైన ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఒకవైపు సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు.. మరోవైపు కాంగ్రెస్ నేతల ఎదురుదాడితో ఎల్బీనగర్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR