LB Nagar: కర్మన్‌ఘాట్‌లో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛట్ పూజ వేడుకలు
LB Nagar: కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ ఆధ్వర్యంలో ఛట్ పూజ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పూజల్లో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
LB Nagar: కర్మన్‌ఘాట్‌లో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛట్ పూజ వేడుకలు
ఎల్బీనగర్: కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయ ఆవరణలో ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ ఆధ్వర్యంలో ఛట్ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉత్తర భారతీయ సోదర సోదరీమణులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఛట్ పూజ దేశ సమగ్ర సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉపవాస దీక్షలు, పండ్ల నైవేద్యాలతో కృతజ్ఞతలు తెలియజేయడం ఈ పర్వదినం ప్రత్యేకత అని అన్నారు.
భక్తుల ఆరోగ్యం, సుఖశాంతులు, కుటుంబ సుభిక్షతతో పాటు రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతీయులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయ మాజీ ధర్మకర్త మధుసాగర్, ఆలయ సిబ్బంది ప్రసాద్, ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ సభ్యులు ఎన్.కే.సింగ్, సంఘ్ పరివార్ కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




