LB Nagar: వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల వైఫల్యం

LB Nagar: వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత, వైద్యుల నిర్లక్ష్యంపై బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 Nov 2026 5:16 PM IST
LB Nagar
X

LB Nagar: వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల వైఫల్యం

ఎల్బీనగర్: వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని, మందుల కొరత, వైద్యుల గైర్హాజరు, సిబ్బంది నిర్లక్ష్యంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ఆరోపించింది. ఆసుపత్రిలో వైద్య సేవలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

రోగుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆయన ఆసుపత్రిని సందర్శించి రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. దగ్గు, దమ్ము, మలేరియా, జ్వరాలు వంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు అవసరమైన పరీక్షలు, మందులు సరిగా అందడం లేదని బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఎక్స్‌రేలు, ఇతర వైద్య పరీక్షల కోసం డబ్బులు అడుగుతున్నారని, మందులు ఆసుపత్రిలో అందుబాటులో లేక బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారని ఆరోపించారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్రసూతి విభాగంలో గర్భిణీ మహిళలకు సరైన వైద్య సేవలు అందడం లేదని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో బాలింతలు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళను ఆసుపత్రిలో చేర్చుకోలేదని, మరో ఆసుపత్రికి తరలించే సమయంలో అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు వెల్లడించారు.

డోలో 650 వంటి సాధారణ మందులు కూడా అందుబాటులో లేవని రోగులు చెబుతున్నారని, సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం బాధాకరమని వెంకటేష్ గౌడ్ అన్నారు.

ఈ సమస్యలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌ను వివరణ కోరగా, టీఎస్ఎంఐడీసీ నుంచి మందుల సరఫరాతో పాటు స్థానికంగా మందులు కొనుగోలు చేసేందుకు నిధుల సమస్యలు ఉన్నాయని తెలిపినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ముఖ్యంగా ప్రసూతి విభాగంలో నిరంతర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వైద్య సేవలు, మందుల నిల్వలు, ప్రసూతి విభాగం పనితీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో బీసీ మహిళా అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మల్లేష్ యాదవ్, మద్దిమడుగు రాజశేఖర్, అడ్వకేట్ దినేష్ కుమార్, పందిరి వినోద్ గౌడ్, గుర్రం విజ్ఞాన్ రెడ్డి, ఎర్ర శ్రీహరి గౌడ్, గజ్జె శ్రీనివాస్ గౌడ్, కారింగుల రవీందర్ గౌడ్, రాజనగర శ్రీకాంత్, పందుల వెంకటేష్ గౌడ్, ఉయ్యాల కుమార్ గౌడ్, కొంగరి కృష్ణ, మామిడి గిరీష్ గౌడ్, గోరా శ్యాంసుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR