Mallapur: 4,130 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన న్యాయవాది ఎర్ర రమేష్!

Mallapur: నేపాల్‌లోని అన్నపూర్ణ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా అధిరోహించిన మల్లాపూర్ న్యాయవాది ఎర్ర రమేష్.. 4,130 మీటర్ల ఎత్తులో త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 5 Nov 2026 8:58 AM IST
Mallapur
X

Mallapur: 4,130 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన న్యాయవాది ఎర్ర రమేష్!

Mallapur: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్వత శ్రేణుల్లో ఒకటైన నేపాల్ హిమాలయ పర్వత ప్రాంతంలోని అన్నపూర్ణ బేస్ క్యాంప్ (Annapurna Base Camp – 4,130 మీటర్లు) వరకు ఓబులాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది ఎర్ర రమేష్ అత్యంత సాహసోపేతమైన ట్రెక్కింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రకృతి సవాళ్లను, ఎముకలు కొరికే చలిని, ఎత్తైన పర్వత మార్గాల్లోని ప్రమాదకర పరిస్థితులను అధిగమిస్తూ ఆయన సాధించిన ఈ విజయం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

సుమారు 4,130 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కు చేరుకోవడం సాధారణ పర్యాటక ప్రయాణం కాదు. శారీరక శ్రమతో పాటు అపారమైన మానసిక ధైర్యం, పట్టుదల, సహనం అవసరమయ్యే అత్యంత క్లిష్టమైన హిమాలయ ట్రెక్కింగ్ ఇది.

జీను నుంచి ప్రారంభమైన ఈ సాహసయాత్రలో సస్పెన్షన్ బ్రిడ్జిలు, లోతైన లోయలు, ఉధృతంగా ప్రవహించే హిమాలయ నదులు, నిటారుగా ఉండే కొండ మార్గాలు, అంతులేని మెట్ల బాటలను దాటుకుంటూ ముందుకు సాగారు.

ఈ ప్రయాణంలో చోమ్రాంగ్, లోయర్ సినువా, అప్పర్ సినువా, బాంబూ, దోవాన్, హిమాలయ, దేయురాలి, మచ్చపుచ్చ్రే బేస్ క్యాంప్ మీదుగా చివరకు అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. సుమారు రెండు రోజులు మూడు గంటల వ్యవధిలో ఈ క్లిష్టమైన ట్రెక్కింగ్‌ను పూర్తి చేయడం విశేషం.

ట్రెక్కింగ్ మార్గంలో ఒక్కో అడుగు వేయడానికి ఎంతో శ్రమించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వందలాది మెట్లు ఎక్కుతూ, మరికొన్ని ప్రాంతాల్లో నిటారుగా ఉన్న కొండలను దిగుతూ, మంచుతో కూడిన చల్లని వాతావరణంలో ముందుకు సాగాల్సి వచ్చింది. ముఖ్యంగా మైనస్ 5 డిగ్రీల వరకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, పలుచబడే ఆక్సిజన్, తీవ్రమైన చలి, అలసట, కండరాల నొప్పులు వంటి సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు.

అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కు చేరుకున్న అనంతరం భారతదేశ గౌరవానికి ప్రతీకగా భారత జాతీయ పతాకాన్ని, సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సమాన హక్కుల సిద్ధాంతానికి ప్రతీకగా జై భీమ్ జెండాను, అలాగే బుద్ధుని శాంతి, కరుణ, ప్రజ్ఞ, మానవతా సందేశాన్ని చాటిచెప్పే పంచశీల పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రకృతి ఒడిలోని హిమాలయ పర్వత సానువులపై ఈ మూడు పతాకాలను ఆవిష్కరించడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని ఎర్ర రమేష్ పేర్కొన్నారు. భారతదేశ గౌరవాన్ని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను, గౌతమ బుద్ధుని మానవతా మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA