Kukatpally: 2,131 ఎకరాల సాలార్‌జంగ్ భూమిని పరిరక్షించాలి

Kukatpally: కూకట్‌పల్లిలోని 2,131 ఎకరాల సాలార్‌‌జంగ్ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని భూ హక్కుదారులు కోరారు.

GIRI, CENTRAL ZONE
Published on: 30 Sept 2026 9:55 PM IST
Kukatpally
X

Kukatpally: 2,131 ఎకరాల సాలార్‌జంగ్ భూమిని పరిరక్షించాలి

కూకట్‌పల్లి: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 806, 1007 నుంచి 1075 వరకు ఉన్న 2,131 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని ఆ భూమి జీపీ ఏ హక్కుదారుడు భరతకవి అశోక్‌ కోరారు. ఈ భూమికి సంబంధించిన టైటిల్‌ యజమాని ఎవరనే విషయంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సదరు భూమికి 1873లోనే పబ్లిక్‌ లీజ్‌ అగ్రిమెంట్‌ పట్టా ఉన్నట్లు తెలిపారు. 2,131 ఎకరాల భూమి నవాబు మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ సాలార్‌జంగ్‌–3కి చెందినదని, ఆయన వారసులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భూమి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుందని ఆరోపించారు.

695 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు

సదరు భూమిపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. పలు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు భూమిపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అశోక్‌ తెలిపారు. ఇప్పటికే సుమారు 695 ఎకరాల్లో ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ భవనాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుని భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు భూమిపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భూ హక్కుదారులు సయ్యద్‌ అబ్దుల్లా, మీర్‌ హైదర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE