Kothaguda: కొత్తగూడలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం!
Kothaguda: కొత్తగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్సీయూ ఆచార్య తాళ్ళ సుమాలిని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
Kothaguda: కొత్తగూడలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం!
కొత్తగూడ: స్వతంత్ర భారతదేశపు తొలి విద్యా శాఖామాత్యులు, భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని కొత్తగూడ పరిధిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 'ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్' కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. పవన్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విభాగం ఆచార్య తాళ్ళ సుమాలిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో గుణాత్మక విద్యకు అబుల్ కలామ్ ఆజాద్ బాటలు వేశారని సుమాలిని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన ఆయన.. గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదులని తెలిపారు. స్వాతంత్ర్యానంతరం 11 ఏళ్ల పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగి ఎన్నో విద్యా సంస్కరణలు తెచ్చారన్నారు.
ఆయన చొరవతోనే దేశంలో యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE), సీయస్ఐఆర్ (CSIR) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటు తొలి ఐఐటీ (IIT) ఖరగ్పూర్లో ఏర్పాటైనట్లు గుర్తుచేశారు. చిన్నపిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యతో పాటు, బాలికల విద్యకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1992లో భారతరత్న పురస్కారంతో గౌరవించిందని, నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు.
నేటి విద్యార్థులు అంతర్జాలానికి (ఇంటర్నెట్) బానిసలై విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని, అవసరమైన మేరకే దానిని ఉపయోగించుకోవాలని ఆమె హితవు పలికారు. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. నిత్యం పుస్తక పఠనం, వ్యాయామం, ధ్యానం చేస్తూ చక్కని చేతిరాత, భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేయడమే మనం ఆజాద్ గారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, ఉపాధ్యాయులు రామేశ్వరరెడ్డి, ప్రభాస్ కుమార్, మధు, జాఫర్, రవీందర్ రెడ్డి తదితరులతో పాటు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




