Kondapur: కొండాపూర్‌లో చోరీ: 4 రోజుల్లో ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు

Kondapur: కొండాపూర్ శిల్పా వ్యాలీలో సినిమాటోగ్రాఫర్ ఇంట్లో జరిగిన చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు 4 రోజుల్లో ఛేదించి 35 తులాల బంగారం, 2 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 9 Nov 2026 3:28 PM IST
Kondapur
X

Kondapur: కొండాపూర్‌లో చోరీ: 4 రోజుల్లో ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు

గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ శిల్పా వ్యాలీలో చోటుచేసుకున్న భారీ దొంగతనం కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. ఓ సినిమాటోగ్రాఫర్ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... శిల్పా వ్యాలీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న సినిమాటోగ్రాఫర్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి క్రైమ్ టీమ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీ పర్యవేక్షణలో వేగంగా దర్యాప్తు ప్రారంభించింది.

దర్యాప్తులో భాగంగా భవనంలో మేస్త్రీగా పనిచేస్తున్న లిమ్మక అనంత్ కుమార్ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అపార్ట్‌మెంట్ టెర్రస్ పైనుంచి తాడు సాయంతో కిందకు దిగి, బాల్కనీ గుండా ఇంట్లోకి చొరబడి చోరీకి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.

అరెస్టు చేసిన నిందితుడి నుంచి 35 తులాల బంగారం, 2 కిలోల వెండితో పాటు ఒక యాక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి, డబ్బుల కోసం ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY