Keesara: కీసరలో నకిలీ జీపీఏ భూ కుంభకోణం - ఐదుగురు నిందితుల అరెస్ట్!

Keesara: కీసర మండలం చీర్యాలలో నకిలీ జీపీఏ, తప్పుడు పత్రాలతో 18 ఎకరాలకు పైగా విలువైన భూములు విక్రయించిన కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్.

ASHOK, KAPRA
Published on: 7 Oct 2026 7:09 PM IST
Keesara
X

Keesara: కీసరలో నకిలీ జీపీఏ భూ కుంభకోణం - ఐదుగురు నిందితుల అరెస్ట్!

Keesara: కీసరలో నకిలీ జిపిఏ తప్పుడు స్థిరాస్తి పత్రాలను ఉపయోగించి విలువైన భూములను అక్రమంగా విక్రయించిన కేసులో ఐదుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి .414/2025 కింద BNSలోని పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కీసర మండలం చీర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 94లో ఉన్న సుమారు 18 ఎకరాల 19 గుంటల భూమికి సంబంధించి ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అసలు యజమానుల పేర్లతో నకిలీ GPA సృష్టించి, దానిని ఆధారంగా చేసుకుని పలు ప్లాట్లకు సేల్ డీడ్‌లు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా బసరికారి శ్రీనివాస్ రావు, బార్లపాటి ఆనంద్, బొర్రా వెంకటేష్, మిర్ సాదిక్ అలీ, రామిడి సత్తి రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నకిలీ పత్రాల ఆధారంగా ప్లాట్ల లావాదేవీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.ప్లాట్ నంబర్లు 21, 28, 38, 59, 129, 145లకు సంబంధించి సేల్ డీడ్‌లు రిజిస్టర్ చేయడంతో పాటు, అనంతరం కొన్ని ఆస్తులకు సేల్ డీడ్‌లు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ GPA లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కొందరు నిందితులు సాక్షులుగా సంతకాలు చేసి నగదు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నేరపూరిత లావాదేవీలలో తటాకం నారాయణ శర్మ, జూపల్లి రవీందర్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు విచారణలో వెల్లడైన నేపథ్యంలో వారి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నకిలీ పత్రాల తయారీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సహకరించిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు మరింతగా విచారణ చేస్తున్నారు.

అరెస్టు చేసిన నిందితులను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం, కొనుగోలుదారుల వివరాలు, ఇతర ఆస్తి నేరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ రికార్డులు, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ఆస్తి వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని కీసర పోలీసులు సూచించారు. అనుమానాస్పద స్థిరాస్తి లావాదేవీలు లేదా నకిలీ పత్రాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కేసును జవహర్‌నగర్ ఏసీపీ ఎస్. చక్రపాణి మార్గదర్శకత్వంలో కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బిక్కి రమేశ్, ఎస్‌ఐ ఎస్. అనిల్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ శ్రీధర్ సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA