LB Nagar: మనసురాబాద్‌లో వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ఠ
LB Nagar: ఎల్బీనగర్ మనసురాబాద్ సాయి సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి.
LB Nagar: మనసురాబాద్‌లో వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ఠ
ఎల్బీనగర్: మనసురాబాద్ లోని సాయి సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
మొదటి రోజు విగ్రహాలకు జలాధివాసం, రెండో రోజు క్షీరాభిషేకం, ధాన్యాధివాసం, పుష్పాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడో రోజు వేదమంత్రోచ్ఛారణలు, పండితుల ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర, పరివార దేవతలు, ఆంజనేయ స్వామి, నవగ్రహ విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మురళీకృష్ణ, కమిటీ సభ్యులు శంకర్, రాంబాబు మాట్లాడుతూ.. సాయి సప్తగిరి కాలనీలో శివాలయం నిర్మించాలనే సంకల్పంతో 2020 మే 28న పనులు ప్రారంభించామని తెలిపారు. కాలనీవాసులు, దాతలు, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రారంభంలో తమ వద్ద ఎలాంటి నిధులు లేకపోయినా, శివుడి అనుగ్రహంతో అందరి సహకారం లభించి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టామని, ఈ మహత్తర కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్ఠా కార్యక్రమాలను పండితులు భాస్కర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆలయ రూపకల్పనలో సహకరించిన ప్రకాష్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో ఈ ఆలయాన్ని పరిసర ప్రాంతాల భక్తులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన మహోత్సవాలు విజయవంతం కావడంతో కాలనీవాసులు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.




