Kapra: జై జవాన్ కాలనీ షట్టర్లకు 12 ఏళ్ల తర్వాత మోక్షం!
Kapra: కాప్రా జై జవాన్ కాలనీలోని 10 వాణిజ్య షట్టర్ల బహిరంగ వేలానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్టీఐ పోరాటం వల్లే 12 ఏళ్ల సమస్యకు మోక్షం లభిస్తోందని తెలిపారు.
Kapra: జై జవాన్ కాలనీ షట్టర్లకు 12 ఏళ్ల తర్వాత మోక్షం!
కాప్రా: మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాప్రా సర్కిల్ డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ జై జవాన్ కాలనీలో గతంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 10 వాణిజ్య దుకాణాల షట్టర్లకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేసిన ఈ దుకాణాలను త్వరలో బహిరంగ టెండర్లు లేదా వేలం ప్రక్రియ ద్వారా కేటాయించేందుకు అధికారులు ప్రాథమిక చర్యలు చేపట్టారు. సుమారు 12 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన అనంతరం ఈ దుకాణాల వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా కాప్రా మున్సిపల్ అధికారులు తాజాగా పది వాణిజ్య దుకాణాల ప్రస్తుత స్థితిగతులు, విస్తీర్ణం, అద్దెలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తదుపరి అనుమతులతో టెండర్లు లేదా వేలం ప్రక్రియ ప్రారంభించేందుకు తొలి అడుగు వేశారు.
ఈ పది దుకాణాల సమస్య పరిష్కారం కోసం గత 12 ఏళ్లుగా తాను చేస్తున్న పోరాటానికి త్వరలో ఫలితం లభించనుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి మేడ్చల్ జిల్లా కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత వివరాలను వెలికితీసి, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం వల్లే ఈ దుకాణాల విషయంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. సామాన్యుడి చేతిలో సమాచార హక్కు చట్టం ఒక శక్తివంతమైన ఆయుధమని ఆయన అన్నారు.
అయితే గత 12 ఏళ్లుగా ఈ దుకాణాల ద్వారా రావాల్సిన అద్దె ఆదాయం ఎంత? ఆ మొత్తం ఎవరి వద్ద ఉంది? ప్రభుత్వ ఖజానాకు ఎంత ఆదాయం చేరింది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని గగన్ కుమార్ పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఈ వివరాలను వెల్లడించి, ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన లెక్కలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని కోరారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారంపై అధికారులు తదుపరి చర్యలు తీసుకుని, బహిరంగ టెండర్లు లేదా వేలం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు దుకాణాల వినియోగానికి మార్గం సుగమం కానుంది.




