Kadthal: అచ్చంపేట బహిరంగ సభకు తరలిరావాలి

Kadthal: నవంబర్ 26న అచ్చంపేట సభకు తరలిరావాలని కడ్తాల్‌లో ఎంపీ మల్లు రవి పిలుపు; 4.72 లక్షల చేయూత పింఛన్ల నగదు జమ, సంత్ సేవాలాల్ విగ్రహానికి భూమిపూజ.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Nov 2026 7:22 PM IST
Kadthal
X

Kadthal: అచ్చంపేట బహిరంగ సభకు తరలిరావాలి

కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు, గిరిజనులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పిలుపునిచ్చారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుగంటి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ నవంబర్ 26న మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థాన ప్రాంగణంలో గిరిజనుల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే అచ్చంపేట బహిరంగ సభలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.

4.72 లక్షల మందికి చేయూత పింఛన్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన సుమారు 4.72 లక్షల చేయూత పింఛన్ల నగదును అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సభా వేదికగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.కావున కడ్తాల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, గిరిజన సోదరులు, మహిళలు, యువత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అచ్చంపేటకు తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ నాయకులు మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చేగూరి వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మాజీ మండల అధ్యక్షుడు బీచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ రాజు, సర్పంచులు రవి, ఉప సర్పంచ్ లకుపతి నాయక్, హీరాసింగ్, దేవేందర్, మండల ప్రధాన కార్యదర్శి విక్రాంత్, పట్టణ అధ్యక్షుడు మాలే మల్లేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచందర్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షుడు బాలరాజ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY