Kadthal: కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి: జైపాల్ యాదవ్!

Kadthal: కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భారీ ధర్నా నిర్వహించింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Nov 2026 9:45 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి: జైపాల్ యాదవ్!

కడ్తాల్: వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి పెట్టుబడులు కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. కడ్తాల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

సోమవారం కడ్తాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కడ్తాల్ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించి వ్యవసాయానికి పెద్దపీట వేశామని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినా కరువు మండలంగా ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి కల్వకుర్తి నియోజకవర్గ రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం

మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. కడ్తాల్ మండలంలో రైతులు సాగు చేసిన పంటలు వర్షాభావంతో ఎండిపోయి తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల దీనస్థితిని గుర్తించి వెంటనే కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై స్పందించని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ ధర్నాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు శ్యామల ముదిరాజ్, ఉపాధ్యక్షుడు భూపాల్, జగన్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, పట్టణ అధ్యక్షుడు కడారి రామకృష్ణ, నాయకులు వీరయ్య, సర్పంచ్ రామచందర్, ప్రియా రమేష్, చిట్టి రమేష్, మాజీ సర్పంచులు తులసి రామ్ నాయక్, గోపాల్, నరసింహ గౌడ్, శ్వేత, భూనాథ్, సులోచన, సాయిలు, భాగ్యమ్మ, జంగయ్య, పూజా, దేవా, మాజీ ఎంపీపీ సువాలి పంతు, మాజీ ఎంపీటీసీ రంగయ్య, శ్రీనివాస్ గౌడ్, కోట్య నాయక్, రమేష్, కుమార్, లాయక్ అలీ, గణేష్ గౌడ్, రవి, యాదయ్య, పాండు నాయక్, వినోద్, సంతోష్ కుమార్, రమణ, మహేష్, లింగం, రాములు, రామచంద్రయ్య, శ్రీకాంత్, వెంకటేష్, నరసింహ, అంజి, శ్రీశైలం, సాబీర్, రవి, సరియా తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY