Hyderabad: తాజ్ డెక్కన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు!
Hyderabad: బంజారాహిల్స్ తాజ్ డెక్కన్‌లో 'మానవ మేధోశక్తి - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జూటూరు కీర్తిరెడ్డి కీలక ప్రసంగం.
Hyderabad: తాజ్ డెక్కన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు!
Hyderabad: హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో బంజారాహిల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో “మానవ మేధోశక్తి – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు జూటూరు కీర్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రొఫెసర్లు, మేధావులు, వైద్యులు, ఐటీ నిపుణులు పాల్గొని మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు మధ్య ఉన్న వ్యత్యాసాలు, వాటి ప్రభావంపై చర్చించారు.
ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం, డిజైనింగ్, నిర్మాణ రంగాలతో పాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతోందని అన్నారు. అయితే, ఈ సాంకేతికతను మంచి పనుల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని, దుర్వినియోగం జరిగితే సమాజానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
AI అవసరమే.. అనివార్యం కాదు!
ముఖ్యంగా రాజకీయ నాయకులకు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక విధాలుగా ఉపయోగపడుతుందని కీర్తిరెడ్డి పేర్కొన్నారు. ఒక అంశంపై సమగ్ర విశ్లేషణ చేయడానికి, దాని పూర్వాపరాలను తెలుసుకోవడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సందేశాలను క్షణాల్లో రూపొదించి ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా పోస్టర్ డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్, ప్రచార కార్యక్రమాల రూపకల్పన వంటి పనుల్లో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రజలతో మమేకం కావడం, వారి భావోద్వేగాలను గుర్తించడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడం వంటి అంశాల్లో మానవ అనుభవానికి మించిన టెక్నాలజీ లేదన్నారామె.
మా స్థానాన్ని AI రీప్లేస్ చేయలేదు!
రాజకీయాలు అంటే కేవలం సమాచార విశ్లేషణ, ప్రచార వ్యూహాలు మాత్రమే కాదన్నారు కీర్తిరెడ్డి. ప్రజలతో సంబంధాలు, స్థానిక పరిస్థితులపై అవగాహన, రాజకీయ సమీకరణాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సి ఉంటుందన్నారు. అంతేకాదు ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి పక్షాన నిలబడి, పరిష్కారాల చూపాల్సిన బాధ్యత మాపై ఉంటుందన్నారు. అందుకే AI సమాచారాన్ని అందించగలదు.. విశ్లేషణ చేయగలదు.. ప్రచారానికి అవసరమైన కంటెంట్‌ను రూపొందించగలదేమో... కానీ ప్రజల కష్టాలను స్వయంగా అర్థం చేసుకొని, వారి మధ్య నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకునే నాయకత్వానికి మానవీయ స్పర్శ అవసరమని అభిప్రాయపడ్డారు. సాంకేతికత ఎంతటి శిఖరాలను అధిరోహించినా, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే మానవీయ నాయకత్వానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని స్పష్టం చేశారు కీర్తిరెడ్డి .
టెక్నాలజీ అసిస్ట్ గా ఉండాలి.. ఆర్డర్ వేసేలా కాదు
మనకు పనులు సునాయాసంగా, త్వరగా పూర్తయ్యేందుకు మనం తయారు చేసుకుంటున్న టెక్నాలజీ.. నేడు కొత్తపుంతలు తొక్కుతున్న.. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత AIపై సమగ్ర అవగాహన పెంచుకోవాల్సిన అవసరం, ఆవశ్యతకత ఎంతైనా ఉందని తెలిపారు. అయితే ఈక్రమంలో ప్రతివిషయంలోనే టెక్నాలజీపైనే ఆదారపడకుండా విచక్షణ, వివేచన, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.




