Kapra: జనవిజ్ఞాన వేదిక 6వ రాష్ట్ర మహాసభలు: పిట్టల నాగరాజు పిలుపు

Kapra: జనవిజ్ఞాన వేదిక 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సీసీఆర్‌టీలో 6వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి.

ASHOK, KAPRA
Published on: 8 Oct 2026 6:25 PM IST
Kapra
X

Kapra: జనవిజ్ఞాన వేదిక 6వ రాష్ట్ర మహాసభలు: పిట్టల నాగరాజు పిలుపు

కాప్రా: జనవిజ్ఞాన వేదిక ఆవిర్భవించి 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర 6వ మహాసభలు అక్టోబర్ 10, 11 తేదీల్లో డా. ఎం.పి. పరమేశ్వరన్ ప్రాంగణం, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (CCRT), హైటెక్ సిటీ, కొండాపూర్‌లో నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు తెలిపారు.

ఈ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 400 మందికి పైగా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని తెలిపారు. మహాసభల్లో గత నాలుగేళ్లుగా నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు, యువతలో ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం; సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, బాబాలు, దయ్యాలు, చేతబడులపై ప్రజల్లో చైతన్యం కల్పించడం; శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాలల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడం; రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను వివరించడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం చేయడం, లౌకిక, ప్రజాస్వామ్య, సమానత్వ భావనలను పరిరక్షించడం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు పిట్టల నాగరాజు తెలిపారు.

మహాసభల అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

గత 38 ఏళ్లుగా నిరంతరంగా సైన్స్ ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్న జనవిజ్ఞాన వేదికకు ప్రజల మద్దతు ఎంతో అవసరమని పిట్టల నాగరాజు అన్నారు. ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA