Boduppal: శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణ!

Boduppal: బోడుప్పల్‌ శ్రీచైతన్య జూనియర్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇంటర్‌ విద్యార్థి కందుల అనూప్ తీవ్రంగా గాయపడ్డాడు.

KARUNAKAR, UPPAL
Published on: 29 Oct 2026 12:41 PM IST
Boduppal
X

Boduppal: శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణ!

Boduppal: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కందుల అనూప్‌ (17) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని అభయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పెద్దపల్లి జిల్లా ఓదెడు గ్రామానికి చెందిన అనూప్‌ శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యశ్వంత్‌ సింగ్‌, రణధీర్‌తో పాటు మరో విద్యార్థి అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మధ్య డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమని సమాచారం. పండుగ సెలవుల అనంతరం కళాశాలకు తిరిగి వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.

హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర గాయాలకు దారితీయడం, ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల పర్యవేక్షణ, హాస్టల్‌ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘటనకు గల కారణాలు, దాడిలో ఎవరెవరి ప్రమేయం ఉందన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అనూప్‌ తల్లిదండ్రులు మానస, శ్రీనివాస్‌ దంపతులు కుమారుడి పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL