Medipally: మేడిపల్లిలో డ్రై డే రోజు అక్రమ మద్యం విక్రయాలపై ఎస్‌వోటీ దాడి!
Medipally: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పరిధిలోని నారపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్‌వోటీ పోలీసులు.
Medipally: మేడిపల్లిలో డ్రై డే రోజు అక్రమ మద్యం విక్రయాలపై ఎస్‌వోటీ దాడి!
Medipally: గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం వైన్స్, బార్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. డ్రై డేను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని(ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి) నారపల్లి సురేందర్‌రెడ్డి నగర్‌లో ఉన్న స్వప్న కిరాణా దుకాణంపై శుక్రవారం దాడి చేశారు.
దుకాణంలో తనిఖీలు నిర్వహించగా వివిధ బ్రాండ్లకు చెందిన విస్కీ, బీరు బాటిళ్లు లభించాయి. మొత్తం 71.230 లీటర్ల మద్యం, సుమారు రూ.45 వేల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి దుకాణ నిర్వాహకుడు శివాజీ జాదవ్ (45)ను అదుపులోకి తీసుకున్నారు. కాగా స్వప్న కిరాణా దుకాణం ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం. ఎక్సైజ్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే డ్రై డే నాడు అక్రమంగా మద్యం విక్రయాలు సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు శివాజీ జాదవ్‌ను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




