Abdullapurmet: జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులకే దిక్కులేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఎలా?
Abdullapurmet: బండరావిరాల పాఠశాలకు కేటాయించిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడిని వెంటనే విధుల్లో చేర్చాలని సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ గురువారం డిమాండ్ చేశారు.
Abdullapurmet: జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులకే దిక్కులేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఎలా?
అబ్దుల్లాపూర్మెట్: బండరావిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారం కోసం పలుమార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
సర్పంచ్, గ్రామ పాలకవర్గం చేసిన ప్రయత్నాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి Proceedings Rc.No.994/A4/2026, తేదీ 09-11-2026 ద్వారా విడుదలైన ఉత్తర్వుల్లో బాటసింగారం జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్) పి. వెంకటేశ్వర్ రావును బండరావిరాల జెడ్పీహెచ్ఎస్కు కేటాయించారు.
ఉత్తర్వుల అనుబంధంలోని రెండో పేజీ, 37వ సీరియల్ నంబర్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారని సర్పంచ్ తెలిపారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో ఆదేశించారని పేర్కొన్నారు.
అయితే ఉత్తర్వులు జారీ అయి 17 రోజులు గడుస్తున్నా సంబంధిత ఉపాధ్యాయుడు బండరావిరాల పాఠశాలలో విధుల్లో చేరకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర్వులు అమలు కాకపోవడానికి గల కారణాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాటసింగారం పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్తో పాటు సంబంధిత అధికారుల బాధ్యతను పరిశీలించి, నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విద్యార్థుల అవసరాలను గుర్తించి ఉపాధ్యాయులను కేటాయించినప్పటికీ ఉత్తర్వుల అమలులో జాప్యం జరగడం వల్ల నష్టపోయేది పేద, మధ్యతరగతి విద్యార్థులేనని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులు వెంటనే స్పందించి కేటాయించిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బండరావిరాల పాఠశాలలో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, గ్రామ పాలకవర్గం, గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేశారు.




