Quthbullapur: ఫాక్స్ సాగర్ పునరుద్ధరణకు అడుగులు!
Quthbullapur: కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఫాక్స్ సాగర్ పునరుద్ధరణ పనులకు సన్నాహాలు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన నేపథ్యంతో చెరువు పరిసరాల్లో పరిశుభ్రత చేపట్టిన హైడ్రా అధికారులు.
Quthbullapur: ఫాక్స్ సాగర్ పునరుద్ధరణకు అడుగులు!
Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ప్రాంతంలో ఉన్న ఫాక్స్ సాగర్ చెరువు పునరుద్ధరణ పనులకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పనులను త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో హైడ్రా అక్కడ ఏర్పాట్లలో నిమగ్నమైంది. శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం విధితమే.
హైడ్రా కమిషనర్ ఆదేశాల ప్రకారం అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం చెరువు కట్టపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. అలాగే ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను తరలిస్తున్నారు. ముళ్ల కంపలను తొలగించి కట్ట స్వరూపం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెరువుకు పూర్వ వైభవం తీసుకు రావాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు ఈ పనులు జరుగుతున్నాయి. చెరువు సహజ లక్షణాలన్నీ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
ఆలయ కమిటీ ప్రతినిధులతో సమావేశం..
ఫాక్స్ సాగర్ కట్టను ఆక్రమించి నిర్మించిన పలు ఆలయాల కమిటీ ప్రతినిధులతో కూడా హైడ్రా, పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. కట్టను బలోపేతం చేయనున్న దృష్ట్యా ఆలయాలన్నిటీని సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రతిపాదనలపై చర్చించారు. 2000 సంవత్సరంలో వరదలు భారీ వర్షాల సమయంలో కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడడం.. ప్రభుత్వ యంత్రాంగం ఇసుక బస్తాలను అడ్డుపెట్టి ఆపిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
22కు పైగా ఉన్న ఆలయాలను ఒకే చోటకు చేర్చి... గుడుల సముదాయం మాదిరి నిర్మించాలనే ఆలోచనను ఆలయ కమిటీ ప్రతినిధుల ముందుంచారు. త్వరలోనే ఆలయ కమిటీ ప్రతినిధులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అభిప్రాయాలను తెలుసుకునేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఒకప్పటి తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన ఈ చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో చెరువును అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైడ్రా ఏసీపీ పి. తిరుమల్ గారు, కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్‌రెడ్డి తో పాటు.. హైడ్రా, పోలీసు అధికారులు ఆలయ కమిటీ ప్రతినిధులతో సమావేశమైనవారిలో ఉన్నారు. అక్కడ చెరువు పునరుద్ధరణ పనుల శంకుస్థాపన పనులను పర్యవేక్షించారు.




