Traffic Alert: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
Traffic Alert: భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని అదుపులోకి తీసుకురావడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad Traffic
Traffic Alert: భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని అదుపులోకి తీసుకురావడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అత్యంత కీలకమైన, ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లక్డీకాపూల్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో వన్-వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కారిడార్‌లో వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం సరికొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.
ఈ కొత్త రూట్ ప్రణాళికలలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా లక్డీకాపూల్ జంక్షన్ వద్ద పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, లక్డీకాపూల్ క్రాస్ రోడ్స్, పాత కంట్రోల్ రూమ్ జంక్షన్, ద్వారకా హోటల్ పరిసరాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా వేగంగా సాగిపోయేలా తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్ అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ వన్-వే ప్రతిపాదనలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నూతన నిబంధనల ప్రకారం పాత కంట్రోల్ రూమ్ నుంచి రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వద్ద నేరుగా ముందుకు అనుమతించరు. ఈ వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, సెక్రటేరియట్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. అలాగే సచివాలయం జంక్షన్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి పాత సైఫాబాద్ పీఎస్ వైపు వెళ్లే వాహనాలు ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్ర భారతి వచ్చి, పాత కంట్రోల్ రూమ్ వద్ద యూ-టర్న్ తీసుకుని అసెంబ్లీ గేట్ నెం. 3, హెచ్‌డీఎఫ్‌సీ మీదుగా పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకునేలా ప్లాన్ చేశారు.
అదేవిధంగా నిరంకారి జంక్షన్ నుంచి పాత కంట్రోల్ రూమ్‌కు వెళ్లే వాహనాలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లించి, ఇక్బాల్ మినార్ వద్ద కుడివైపునకు తిప్పి రవీంద్ర భారతి మీదుగా పాత కంట్రోల్ రూమ్‌కు చేరేలా మార్గం డిజైన్ చేస్తున్నారు. ఈ మార్పులన్నింటినీ తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ వన్-వే అమలు సమయంలో వాహనదారులు, ప్రయాణికుల నుంచి వచ్చే అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి, అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసిన తర్వాతే శాశ్వత నిబంధనలుగా ఖరారు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటికే నగరంలోని ప్రముఖ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే సిస్టమ్ విజయవంతంగా అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లక్డీకాపూల్‌తో పాటు కేబీఆర్ పార్క్ వద్ద ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న వన్-వే మార్గానికి అదనంగా మరో కొత్త ట్రాఫిక్ లేన్‌ను ఏర్పాటు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. జిహెచ్ఎంసి, ఆర్ అండ్ బి వంటి ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ పనులను వేగంగా పూర్తి చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ రహిత సురక్షిత ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పోలీసులు శ్రమిస్తున్నారు.




