Hyderabad: ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం కవిత

Hyderabad: ఫేక్ పెట్టుబడుల గ్లోబల్ సమ్మిట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించిన కవిత. గ్రేటర్ ఎన్నికలపై దిశానిర్దేశం, మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Oct 2026 10:30 PM IST
Hyderabad
X

Hyderabad: ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం కవిత

హైదరాబాద్: ఫేక్ అగ్రిమెంట్లు, ఫేక్ పెట్టుబడులతో నిర్వహిస్తున్న ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. గతేడాది తెచ్చామని చెప్పుకుంటున్న ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన శ్వేతప్రతాన్ని విడుదల చేయాలని లేదంటే డిసెంబర్ లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ అడ్డుకోని తీరుతామని శుక్రవారం మియాపూర్ లో జరిగిన టీఆర్ఎస్ రాజధాని రణభేరి సభలో హెచ్చరించారు.

హైదరాబాద్ అభివృద్ధికి పెట్టుబడులు కావాలని తాము కోరుకుంటున్నామని కానీ అబద్దాలు, నకిలీ పెట్టుబడులతో మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మరికొన్ని రోజుల్లో బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు, క్యాడర్ తో రాజధాని రణభేరి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో బల్దియా ఎన్నికలకు సంబంధించి కేడర్ కు దిశానిర్దేశం చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ గ్రేటర్ లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూడు కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్లలో పోటీ చేస్తామని ఆమె చెప్పారు. కనీసం తాగటానికి కూడా మంచి నీళ్లు ఇవ్వనోళ్లు విశ్వనగరమంటూ ప్రచారం చేసుకుంటున్నారని..వీళ్లా హైదరాబాద్ ను న్యూయార్క్, లండన్ చేసేదంటూ ఎద్దేవా చేశారు.

నగరంలో సరైన రోడ్లు, డ్రైనైజీ వ్యవస్థ, మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదని.. దోమలు, కుక్కలు స్వైర విహారం చేస్తుంటే పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి లైట్లు ఎప్పుడు వెలుగుతాయో ఎవరికీ తెలియదని, సీనియర్ సిటిజన్స్ కు భద్రత, గౌరవం లేని పరిస్థితి ఉందన్నారు. హైదరబాద్ లో చెప్పులను ఏసీ షోరూమ్ లల్లో కూరగాయలు, చేపలను రోడ్లపై పెట్టి అమ్ముతున్నారన్నారు.

ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. కూరగాయలు, చేపలు అమ్మే వారికి ఏసీ బండ్లను ఇవ్వాలని కోరారు. బస్తీ దవాఖానాల్లో డాక్టర్ల సంఖ్య పెంచాలని, ప్రతి డివిజన్ లో 24 గంటలు నడిచే హాస్పిటల్ ఉండాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఫాగింగ్, రోడ్ల నిర్మాణంలో, కుక్కల బెడద నివారణ, చెత్త, డ్రైనేజీ నిర్వహణ ఇలా అన్నింటిలో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

మానవత్వంతో కూడిన మార్పు రాలే

హైదరాబాద్ లో మానవత్వంతో కూడిన మార్పు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 10 వేలు జీతం వచ్చే వారైనా లక్ష రూపాయలు జీతం వచ్చే వారైనా సరే ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రూపీ వ్యాల్యు తగ్గటం, ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవటంతో విపరీతంగా ధరలు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ల్యాండ్ గ్రాబింగ్ కారణంగా హైదరాబాద్ చుట్టు పక్కల పంటలు పండే భూమి కోల్పోతున్నామని చెప్పారు.

రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి కోసం కాకుండా అవినీతి కోసం వాడుకుంటున్నారన్నారు. ఐటీ ఉద్యోగులు ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తే వారిని ఆదుకునేందుకు ఒక పాలసీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను ఐటీ నగరంగా నిలబెట్టిన ఐటీ ఉద్యోగులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో చెత్త సేకరించే 50 వేల మంది ఉద్యోగులపై రేవంత్ రెడ్డి కన్నుపడిందని..వారికి నష్టం చేస్తూ రామ్ కీ సంస్థకు మేలు చేయాలని చూస్తున్నారని చెప్పారు.

ఆ 50 వేల మంది కుటుంబాల పరిస్థితి ఏంటనీ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వారికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్తవేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా కట్టటం లేదని..కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు.

సముద్రం లేని హైదరాబాద్ ను నిజాంలు పెర్ల్ సిటీ గా అభివృద్ధి చేస్తే ఈ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలకు కనీస సౌకర్యాలు అందించటం లేదని ధ్వజమెత్తారు. బిర్యానీ, ఇరానీ ఛాయ్, ముత్యాలకు ప్రసిద్ధి చెందిన నగరాన్ని దోమలకు నిలయంగా, కుక్కకాట్లకు కేంద్రంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంధించే వేటగాడు వచ్చాడనే విషయం గుర్తు పెట్టుకోండి

బీఆర్ఎస్ పార్టీ తాము షేర్ అని, కాంగ్రెస్ బబ్బర్ షేర్ అని చెప్పుకుంటున్నాయని కానీ ఆ పులులను బంధించే వేటగాడైన టీఆర్ఎస్ పార్టీ వచ్చిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కవిత హెచ్చరించారు. ప్రజలకు చేయాల్సింది చాలా ఉందని అందుకోసం ఎంతో క్రమశిక్షణతో పనిచేయాలని పార్టీ కేడర్ కు ఆమె సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనుకునే వాళ్లు ప్రజలకు తమ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించాలని చెప్పారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలు అందిస్తామని, ప్రజలకు ఉచిత విద్య, వైద్యం ఇస్తామన్నారు. ప్రజల కోసం పనిచేసే తమతో పెట్టుకోవద్దని ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ విధానాలను గల్లీ గల్లీకి వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ కేడర్ కు సూచించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యూత్ కు 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు.

మహిళలు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే రాజకీయాలు మారుతాయని చెప్పారు. పాతబస్తీ లో ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గులామ్ గా కాకుండా ప్రజలకు గులామ్ గా ఉండాలన్నారు. పాతబస్తీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు. ముస్లింలను అన్ని పార్టీలు మోసం చేశాయని వారికి తాము మేలు చేస్తామని చెప్పారు. కొత్తగా వచ్చిన మన పార్టీ ఇతర పార్టీలతో పోల్చితే పది రెట్లు ఎక్కువ కష్టపడాలన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్