Hyderabad Heavy Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ట్రాఫిక్ జామ్
Hyderabad Heavy Rain: హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Hyderabad Heavy Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ట్రాఫిక్ జామ్
Hyderabad Heavy Rain: హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రానికి మారిన వాతావరణం
గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కూడా మధ్యాహ్నం వరకు ఎండ ప్రభావం కొనసాగింది. అయితే సాయంత్రం సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. కొద్దిసేపటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడటంతో వాతావరణం చల్లబడింది.
ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు..
నగర తూర్పు ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, చెంగిచర్ల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మేడిపల్లి నుంచి చెంగిచర్ల వరకు వాన జోరుగా పడటంతో స్థానిక రహదారులపై నీరు నిలిచింది. ఘట్‌కేసర్, పోచారం, కీసర, నాగారం పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఈసీఐఎల్, కుషాయిగూడ, నేరేడుమెట్, కాప్రా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
బంజారాహిల్స్, గచ్చిబౌలిలో భారీ వర్షం.. ట్రాఫిక్ కష్టాలు
పశ్చిమ హైదరాబాద్‌లోనూ వర్షం ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, రాయదుర్గం, షేక్‌పేట, టోలిచౌకి ప్రాంతాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, మధురానగర్, మెహదీపట్నం, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే సమయంలోనే వాన పడటంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. గచ్చిబౌలి, ఉప్పల్ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. కొన్ని చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పాతబస్తీ, శివారు ప్రాంతాలకూ వర్షం..
హైదరాబాద్ పాతబస్తీలోనూ వర్షం తన ప్రభావాన్ని చూపించింది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్, బండ్లగూడ, ఛత్రినాక, శాలిబండ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, తుర్కయంజాల్, మన్నెగూడ, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లోనూ వాన పడింది.
మరోవైపు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నీరు నిలిచే రహదారులు, లోతట్టు ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా ఉండటం మంచిది.




