Kushaiguda: కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద ట్రాఫిక్ సమస్యపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన
Kushaiguda: కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద బారికేడ్ల తొలగింపుతో ట్రాఫిక్ పెరిగిందని, చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు బస్సు సర్వీసులు పొడిగించాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
Kushaiguda: కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద ట్రాఫిక్ సమస్యపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన
కుషాయిగూడ: కుషాయిగూడ బస్ స్టాప్ పునరుద్ధరణ పేరుతో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడంతో ట్రాఫిక్ సమస్య తగ్గకపోగా మరింత పెరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసుల పోచయ్య గౌడ్, ఉమ్మడి చెర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బారికేడ్ల తొలగింపుతో ట్రాఫిక్ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
సికింద్రాబాద్, కోటి, అఫ్జల్‌గంజ్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను కేవలం కుషాయిగూడ వరకే పరిమితం చేయడంతో పరిసర ప్రాంతాల్లోని సుమారు 50 కాలనీల ప్రజలు రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కుషాయిగూడకు అనుసంధానంగా అభివృద్ధి చెందిన నాగార్జున నగర్ కాలనీ, చక్రిపురం, చర్లపల్లి తదితర ప్రాంతాల వరకు బస్సు సర్వీసులను పొడిగిస్తే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగడంతో పాటు కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద రద్దీ తగ్గుతుందని వివరించారు.
ముఖ్యంగా నాగార్జున నగర్ కాలనీ, చక్రిపురం మీదుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు బస్సు సర్వీసులను పొడిగిస్తే ఆయా కాలనీల ప్రజలతో పాటు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
బస్సులను కేవలం కుషాయిగూడకే పరిమితం చేయకుండా పరిసర కాలనీల వరకు కొనసాగిస్తే ప్రయాణికులకు నేరుగా రవాణా సౌకర్యం అందుతుందని, బస్ స్టాప్ వద్ద రద్దీ తగ్గి ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. అనవసరమైన బస్సుల నిలుపుదల తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి కొంతమంది వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధాన రహదారిపై బారికేడ్ల తొలగింపునకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని విమర్శించారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారుల సౌకర్యార్థం బారికేడ్లను కొంతమేర పక్కకు జరిపి వెసులుబాటు కల్పిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యతగా అధికారులు చర్యలు తీసుకోవాలి
కుషాయిగూడతో పాటు పరిసర కాలనీల ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సుల గమ్యస్థానాలను పొడిగించాలని, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా బస్ స్టాప్ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు సమగ్ర నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లేనిపక్షంలో ఈ సమస్యపై పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని, అవసరమైతే ఉన్నతాధికారులతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి సమస్యను వివరిస్తామని కాసుల పోచయ్య గౌడ్, సింగిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.




