Hyderabad: సింగరేణి సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
Hyderabad: సింగరేణి భవన్ ముట్టడి మరియు ధర్నా నిర్వహించిన బీఆర్‌ఎస్ నేతలు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, జెన్‌కో బకాయిలు చెల్లించాలని డిమాండ్.
Hyderabad: సింగరేణి సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్: సింగరేణి సంస్థలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణలో విద్యుత్ సరఫరాకు అవసరమైన నాణ్యమైన బొగ్గును సమృద్ధిగా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో “చలో సింగరేణి భవన్” కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ఎదుట ధర్నా చేపట్టారు.
అనంతరం సింగరేణి అధికారులతో చర్చలు జరిపి, డైరెక్టర్ ఆపరేషన్స్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్మికులకు సంబంధించిన మెడికల్ బోర్డులను నెలకు మూడుసార్లు నిర్వహించాలని, వైద్య సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికులపై భారంగా ఉన్న పేర్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ మాఫీకి చర్యలు తీసుకోవాలని కోరారు.
సింగరేణికి జెన్‌కో నుంచి రావాల్సిన రూ.67 వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేసి సంస్థకు చెల్లించాలని, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల భద్రత, సంక్షేమం, సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి పెంపుపై యాజమాన్యం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని జెన్‌కో సంస్థలకు అవసరమైన మేరకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని టీబీజీకేఎస్ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాని వీరభద్రం, కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు గడప రాజయ్య, కొత్తగూడెం కార్పొరేట్ ఉపాధ్యక్షుడు తుమ్మ శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ నాయకులు కిరణ్‌కుమార్, గిన్నారపు మహేందర్, సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




