Hayathnagar: భూసేకరణ రచ్చ.. 18 ఎకరాల స్వాధీనానికి అధికారుల యత్నం!

Hayathnagar: హయత్‌నగర్ సర్వే నంబర్ 255లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం 18 ఎకరాల భూసేకరణ చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులు, నేతల ముందస్తు అరెస్టులు.

AJAY, HAYATH NAGAR
Published on: 24 Oct 2026 9:33 AM IST
Hayathnagar
X

Hayathnagar: భూసేకరణ రచ్చ.. 18 ఎకరాల స్వాధీనానికి అధికారుల యత్నం!

Hayathnagar: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో భూసేకరణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న ఏక్‌సాల్ పట్టా భూముల్లోని 18 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టేందుకు అధికారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

హయత్‌నగర్‌లోని సర్వే నంబర్ 255 వద్ద ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆధ్వర్యంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. భారీగా పోలీసు బలగాలను మోహరించి, అధికారులు భూమిని చదును చేసే పనులు చేపట్టారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

తమ భూములను కాపాడుకునేందుకు అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించిన రైతులతో పాటు, గతంలో వారికి మద్దతుగా నిలిచిన పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లు సమాచారం.

గతంలోనూ భూసేకరణ కోసం వచ్చిన అధికారులను స్థానిక రైతులు వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి అధికారులు భూమి స్వాధీనానికి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.

భూములపై తమ హక్కులను కాపాడుకోవాలని రైతులు ప్రయత్నిస్తుండగా, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం భూమిని స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ భూములకు సంబంధించిన పట్టా వివరాలు, రైతుల అభ్యంతరాలు, భూసేకరణపై అధికారుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR