Hayathnagar: రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు 8 ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక!

Hayathnagar: హయత్‌నగర్ జడ్పీహెచ్‌ఎస్‌లో 32వ జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఘనంగా జరిగింది. 153 మంది విద్యార్థులు పాల్గొనగా, 8 ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి.

AJAY, HAYATH NAGAR
Published on: 4 Nov 2026 7:32 PM IST
Hayathnagar
X

Hayathnagar: రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు 8 ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక!

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో బుధవారం 32వ జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 100 పాఠశాలల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న 153 మంది విద్యార్థులు హాజరై తమ శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనలు, వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కార దిశగా ఆలోచించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యాలను పెంపొందించి, శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి చెందేలా బోధించాలని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు నామినేట్ చేయనున్నట్లు వెల్లడించారు.

మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌తో పాటు సేవ్ ఫస్ట్ ఇన్నోవేషన్, ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్, తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వంటి పలు సైన్స్ సంబంధిత కార్యక్రమాల్లో సైన్స్ ఉపాధ్యాయులందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతులు సాధించిన ఎనిమిది ప్రదర్శనలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.

కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వ్యవహరించారు. డాక్టర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి, ప్రొఫెసర్ లింగమయ్య, డాక్టర్ కిరణ్, ప్రొఫెసర్ డాక్టర్ చెన్నకేశవులు, ఆనంద్ సాయి, డాక్టర్ గోవింద్, సుభాష్ రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీఎస్‌సీ అసిస్టెంట్ కోఆర్డినేటర్ మాణిక్యారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి, పి. శ్రీనివాస్, వివిధ పాఠశాలల గైడ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR